వరంగల్, అక్టోబర్ 30: గ్రేటర్ వరంగల్‌లో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేందుకు జీడబ్ల్యూఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దోమలతో వచ్యే వ్యాధుల నివారణకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో పకడ్బందీగా ఫాగింగ్ చేసేలా కార్యాచరణ చేస్తున్నారు. ప్రతి డివిజన్లో 15 రోజులకోసారి ఫాగింగ్ నిర్వహించేలా ప్రణాళికలు చేశారు. డివిజన్లలో కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేలా క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు.
దోమల నివారణపై ప్రత్యేక దృష్టి
నగరంలో దోమల నివారణపై గ్రేటర్ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బందికి నీరు నిల్వ ఉండకుండా ప్రజలను చైతన్యం చేయాలని సూచిస్తున్నారు. రెండు మూడు రోజులపాటు నిల్వ ఉన్న నీటిలో లక్షల సంఖ్యలో దోమల లార్వా ఉత్పత్తి అవుతాయన్న విషయాన్ని సిబ్బంది ప్రజలకు వివరించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించేలా ప్రజలను చైతన్యం చేసేలా ప్రచార కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు. దీంతోపాటు సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యాచరణ చేస్తున్నారు.
బల్దియాకు పూర్తిస్థాయి బయాలజిస్ట్
కొన్నేళ్లుగా గ్రేటర్ కార్పొరేషన్‌కు పూర్తిస్థాయి బయాలజిస్ట్ లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. సీఎంహెచ్వోనే అర్బన్ మలేరియా వింగ్‌ను పర్యవేక్షించేవారు. నెల రోజుల క్రితం బల్దియాకు పూర్తిస్థాయి బయాలజిస్ట్ రావడంతో అర్బన్ మలేరియా విభాగం పటిష్టంగా మారుతున్నది. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నివారణపై బయాలజిస్ట్ మాధవరెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆయనతోపాటు ఇద్దరు హెల్త్ అసిస్టెంట్లు, 170 మంది క్షేత్రస్థాయి సిబ్బందితో బల్దియా అర్బన్ హెల్త్ విభాగం పటిష్టంగా ఉంది. 4 ఫాగింగ్ ఆటోలు, 36 హ్యాండ్ ఫాగింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఎల్ ఆయిల్, టిమోపాస్ రసాయనాలు సరిపోను అందుబాటులో ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖను సమన్వయం చేసుకుంటూ బల్దియా అర్బన్ హెల్త్ విభాగం సీజనల్ వ్యాధులకు పక్కాగా చెక్ పెట్టేలా ముందుకెళ్తున్నది.