కాళేశ్వరం, అక్టోబర్ 30 : శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తజనంతో పోటెత్తింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా సహా కరీంనగర్, హైదరాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులతో సందడి నెలకొంది. ముందుగా త్రివేణి సంగమం గోదావరి తీరంలో భక్తులు స్నానాలు చేసి మహిళలు కార్తీక దీపాలు వదిలారు. అలాగే సైకత లింగాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకాలు చేశారు. అలాగే శుభానంద దేవి (పార్వతి అమ్మవారు) ఆలయంలో కుంకుమ అర్చన, పూజలు చేశారు. ఆలయంలోని తులసీ చెట్టుకు పూజలు చేసి, ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. వివిధ పూజలు, లడ్డూ, పులిహోర విక్రయాల ద్వారా రూ.3లక్షల వరకు ఆదాయం సమకూరిందని ఆలయాధికారులు తెలిపారు.