ఐనవోలు, అక్టోబర్ 30 : మంత్రి ఎర్రబెల్లి దయకార్‌రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న విషయం గమనించి తన కాన్వాయిలో తక్షణ వైద్యం కోసం ఎంజీఎంకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. ఐనవోలు మండలం వరంగల్-ఖమ్మం రహదారిపై పంథిని శివారులో కల్వర్టు వద్ద ఆదివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన చీర రమేశ్‌కు గాయాలయ్యాయి. అదే సమయంలో మునుగోడు నుంచి వస్తూ పర్వతగిరి మీదుగా హనుమకొండకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెళ్తున్నారు. మార్గమధ్యలో జరిగిన ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్ దిగి సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి ఎర్రబెల్లి, తన సహాయక సిబ్బంది, గ్రామస్తులతో కలిసి క్షతగాత్రుడిని కాన్వాయ్‌లో ఎంజీఎంకు తరలించారు. వెంటనే ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి, క్షతగాత్రుడికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మంత్రి స్పందించిన తీరును చూసిన ప్రయాణికులు ఎర్రబెల్లిని ప్రశంసించారు.