హనుమకొండ, అక్టోబర్ 30: గ్రేటర్ వరంగల్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం టీయూడబ్ల్యూజే హెచ్-143 ఉమ్మడి వరంగల్ కన్వీనర్ అధ్యక్షతన జరిగిన జర్నలిస్టుల ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ యూనియన్లతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ప్రెస్‌క్లబ్ ఎన్నికల ప్యానల్ ప్రకటించనున్నట్లు తెలిపారు. యూనియన్ సభ్యులందరూ రాష్ట్ర కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. త్వరలో జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని, వచ్చే జనవరిలో హైదరాబాద్‌లో జాతీయ మహాసభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. యూనియన్ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వరంగల్ జిల్లా ఉద్యమాలగడ్డ అని, పోరాట స్ఫూర్తిని కలిగి ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా జర్నలిస్టులు ముందు వరుసలో నిలిచారన్నారు. అనంతరం పలువురు జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే హెచ్ 143లో చేరగా వారిని అల్లం నారాయణ స్వాగతించి సభ్యత్వాలు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, ఇస్మాయిల్, ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ నాయకులు, ఫొటో, వీడియో, ప్రింట్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.