సుబేదారి, అక్టోబర్ 28: కేసుల విచారణలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి వరంగల్ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, పోలీసు అధికారులతో మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలో కేసుల స్థితిగతులు, ఏకీకృత సేవలు, పారదర్శకతను విస్తరింపజేయడమే లక్ష్యంగా అమలవుతున్న వర్టికల్స్ అమలు తీరుపై సీపీని అడిగి తెలుసుకున్నారు.
నేర పరిశోధన, కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్ట్, చార్జిషీట్ సమయాల్లో కచ్చితమైన ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల్లో పురోగతి సాధించడానికి సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టి నిందితులకు శిక్ష పడేలా దృష్టిసారించాలని సూచించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎప్పటికప్పుడు కోర్టు మానిటరింగ్ సిస్టం ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తూ, కేసుల విచారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గనిర్దేశం చేస్తున్నట్లు సీపీ వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు అశోక్‌కుమార్, వెంకటలక్ష్మి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.