నర్సంపేట రూరల్/పర్వతగిరి, అక్టోబర్ 28: నర్సంపేట మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని మండల నోడల్ ఆఫీసర్ కొర్ర సారయ్య సూచించారు. పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో శుక్రవారం ఆయన తొలిమెట్టు అమలు తీరుపై హెచ్ఎంలతో సమీక్షించారు. పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఉపాధ్యాయులు పెంచాలన్నారు. అందరి భాగస్వామ్యంతోనే తొలిమెట్టు కార్యక్రమం విజయవంతం అవుతుందని టీచర్లకు సూచించారు. లెస్సన్ ప్లాన్ ప్రకారం బోధించాలని, పాఠ్యపుస్తకం చివరన ఉన్న కృత్యాలను విద్యార్థులతో చేయించాలన్నారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే, పర్వతగిరిలో తొలిమెట్టు అమలుపై ఎంఈవో సత్యనారాయణరావు హెచ్ఎంలతో సమీక్షించారు. ప్రతి పాఠ్యాంశంలో పిల్లలు అభ్యసన సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. తొలిమెట్టు కార్యక్రమ నోడల్ అధికారి సీహెచ్ రమేశ్‌బాబు మాట్లాడుతూ హెచ్ఎంలు ప్రతి ఐదు రోజుల తర్వాత మూల్యాంకనం చేయాలన్నారు. సమీక్షలో పర్వతగిరి ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎండీ జలీల్, ఎమ్మార్పీ సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నారావుపేట: విద్యార్థులకు చదవడం, రాయడం నేర్పించాలని తొలిమెట్టు నోడల్ అధికారి ఫ్లోరెన్స్ అన్నారు. చెన్నారావుపేట ఎంపీడీవో కార్యాలయంలో హెచ్ఎంలతో తొలిమెట్టు కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను సమావేశంలో వివరించారు. అనంతరం ఫ్లోరెన్స్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థికి కనీస అభ్యసన సామర్థ్యాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. పేరెంట్, టీచర్స్ మీటింగ్‌కు తలిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా టీచర్లు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సరళ, పాపమ్మ, రవి, భద్రయ్య, ఇంద్రయ్య, మల్లయ్య పాల్గొన్నారు.
గిర్మాజీపేట: పాఠశాలల్లో సీగ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారి అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచి, ఏ, బీ గ్రేడ్ల వారితో సమానంగా రాణించేలా ఉపాధ్యాయులు తోడ్పాటునందించాలని ఎఫ్ఎల్ఎన్(తొలిమెట్టు) వరంగల్ మండల నోడల్ అధికారి గంప అశోక్‌కుమార్ సూచించారు. తొలిమెట్టు కార్యక్రమంపై ఆయన హెచ్ఎంలు, సీఆర్పీలతో కృష్ణాకాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో సమీక్షించారు. ఉపాధ్యాయులు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు కుంట రవికుమార్, పుషారం, డీపీసీ నర్సింహారావు, రఘునాయక్, గౌహర్ఫాతిమా, సీఆర్పీలు పాల్గొన్నారు.