వరంగల్, అక్టోబర్ 27 : వరంగల్ మహానగరాన్ని వంద శాతం ఎల్ఈడీ వెలుగులతో నింపాలన్న లక్ష్యంతో గ్రేటర్ అడుగులు వేస్తోంది. నగరంలోని ప్రతి మూల ఎల్ఈడీ లైట్ల వెలుగులు జిగేల్ మంటున్నాయి. గతానికి భిన్నంగా పూర్తిస్థాయిలో ఎల్ఈడీ లైట్లను వీధి దీపాలు వినియోస్తుండడంతో విద్యుత్ బిల్లు రూ.లక్షల్లో ఆదా అవుతోంది. రోజు రోజుకు విస్తరిస్తున్న నగరంలో వీధి దీపాల సంఖ్య పెరుగుతున్నా విద్యుత్ బిల్లు గతంలో పోలిస్తే సగానికి తక్కువగా వస్తోంది. గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో వంద శాతం వీధి దీపాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నగరంలో వేగంగా ఏర్పాటవుతున్న కొత్త కాలనీలపై అధికారులు దృష్టిసారిస్తున్నారు. అన్ని శ్మశాన వాటికలు, అప్రోచ్ రోడ్ల కూడళ్లలో ఎల్ఈడీ లైట్ల టవర్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈఈఎస్ఎల్ సంస్థకు వీధి దీపాల నిర్వహణ
ఎల్ఈడీ లైట్ల వినియోగంతో గ్రేటర్‌కు పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది. ప్రతి నెల రూ.40 లక్షల విద్యుత్ బిల్లు మిగులుతోంది. గతంలో హైమాస్ట్, మెర్క్యూరి లైట్లు వాడడంతో ప్రతి నెలా రూ.85 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు విద్యుత్ బిల్లు వచ్చేంది. ప్రస్తుతం నగర మంతా ఎల్ఈడీ లైట్లను వినియోగిస్తుండడంతో ప్రతి నెలా రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల విద్యుత్ బిల్లు వస్తోందని అధికారులు చెబుతున్నారు. వీధి దీపాల నిర్వహణను ఎనర్జీ ఎఫీషియెంట్ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సంస్థకు అప్పగించారు. ఎల్ఈడీ లైటు ఏర్పాటు చేసిన నాటి నుంచి ఏడేళ్ల వరకు నిర్వహణ, మరమ్మతులు అన్ని సదరు సంస్థ నిర్వహిస్తోంది.
వంద శాతం వీధి దీపాలు
407 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న మహానగరంలో వంద శాతం వీధి దీపాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 83,750 ఎల్ఈడీ వీధి దీపాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పట్టణ ప్రగతిలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వీధి దీపాలు అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించారు. మరో 7,150 లైట్లు, 2,700 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని లెక్క తేల్చారు. అయితే, కొన్ని లైట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు కోసం ట్రాన్స్‌కో వారికి స్కెచ్ ప్లాన్ (స్తంభం ఏర్పాటు చేయాల్సిన ప్రాతం ప్లాన్) పంపించామని పేర్కొన్నారు. మరో మూడు నెలల్లో స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లను బిగిస్తామని చెబుతున్నారు.
66 డివిజన్లలో సర్వే
ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో స్ట్రీట్ లైట్ల వివరాలు సేకరించారు. పట్టణ ప్రగతిలో ఇప్పటికే ఒక అంచనా ఉన్న అధికారులకు ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది డివిజన్ల వారీగా సర్వేతో పక్కా లెక్కలు వచ్చాయి. సర్వేతో కొత్త స్తంభాలు, లైట్ల ఏర్పాటుతో కొత్త కాలనీల్లో ఏర్పాటు చేయాల్సిన స్ట్రీట్ లైట్ల లెక్క అంచనా వచ్చిందని అధికారులు తెలిపారు.
ఎల్ఈడీ లైట్లతో విద్యుత్ బిల్లు ఆదా
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి కాలనీలో ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఇప్పటికే నగరంలో 83,750 ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశాం. మరో 7,150 లైట్లు, 2,700 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తే వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కొత్త కాలనీలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. విలీన గ్రామాల్లో ఇప్పటికే ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశాం. ఎల్ఈడీ స్ట్రీట్ లైట్ల వినియోగంతో విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది.
– సంజయ్‌కుమార్, ఈఈ ఎలక్ట్రికల్ విభాగం