డోర్నకల్, అక్టోబర్ 20 : నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చేసే దిశగా రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది. చివరి ఆయకట్టుకూ నీరందేలా వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. కాల్వలకు మరమ్మతు చేయిస్తున్నది. ఇందులో భాగంగా నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద రైతుల ఆయకట్టు స్థిరీకరణ కోసం రాష్ట్ర సర్కారు సీతారామ ప్రాజెక్టును సుమారు రూ.364 కోట్లతో నిర్మిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామపట్నం వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా పాలేరు రిజర్వాయర్‌లోకి తరలించేలా శ్రీ సీతారామప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును డిజైన్ చేసి నిర్మిస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా రెండు తెలుగు రాష్ర్టాల్లోని రైతులకు సాగునీరు అందుతున్నది.
ఎడమ కాల్వ అయిన లాల్‌బహుదూర్ కాల్వ ద్వారా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాకు సాగునీరు అందుతున్నది. కాగా, ఎడమ కాల్వకు నీటి విడుదల ఆలస్యమవడంతో జూన్, జులై నెలలో వేయాల్సిన వరినాట్లు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వేయాల్సిన పరిస్థితి. దీంతో నవంబర్, డిసెంబర్ నెలల్లో పంట చేతికొచ్చినా తుపానులతో రైతులు నష్టపోయేవారు. అంతేకాకుండా ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కృష్ణా నదిలో వరద తగ్గి సాగు నీళ్లు అందక ఆయకట్టు భూములు బీళ్లుగా మారి రైతులు ఇబ్బందిపడేవారు. ఇలాంటి పరిస్థితులను అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం పుష్కలంగా నీటి లభ్యత ఉన్న గోదావరి నీటిని సాగర్ ఎడమ కాల్వకు మళ్లించి ఆయకట్టుదారులకు పూర్తి భరోసా కల్పించడానికి శ్రీ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నది.
పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 600 క్యూసెక్కుల నీటిని గ్రావిటీ ద్వారా తరలించేలా కాల్వను నిర్మిస్తున్నారు. ఇందులో 15వ ప్యాకేజీలో భాగంగా డోర్నకల్ మండలం మున్నేరుపై అక్విడెక్ట్ నిర్మిస్తున్నారు. దాదాపు 80శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే ఫిబ్రవరి నెల వరకు పూర్తవుతుందని సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. దీంతోపాటు డోర్నకల్ మండలంలో కాల్వ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే 600ఎకరాలకు పైగా భూమిని సేకరించి, 2012 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించి పనులు మొదలు పెట్టింది. దాదాపు మండలంలో 60శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మొత్తంగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బుద్దారం నుంచి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం వరకు కాల్వ నిర్మాణానికి 23 కిలోమీటర్లు భూమిని సేకరించారు.
సీతారామ ప్రాజెక్టు కోసం డోర్నకల్ మండలంలోని 6 రెవెన్యూ గ్రామాల రైతుల నుంచి భూమని సేకరించారు. ఉయ్యాలవాడలో 134 ఎకరాలు, డోర్నకల్‌లో 104 ఎకరాలు, బూర్గుపాడులో 18 ఎకరాలు, కన్నెగుండ్లలో 148 ఎకరాలు, రావిగూడెంలో 109 ఎకరాలు, మన్నెగూడెంలో 97 ఎకరాలు మొత్తం 612 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి, రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం సొమ్మును జమ చేసింది. దీంతోపాటు గార్ల మండలంలో 15వ ప్యాకేజీ కింద 10ఎకరాల భూమిని సేకరించింది.