హనుమకొండ, అక్టోబర్ 20 : భవిష్యత్తరాలకు పచ్చదనం అందించాలని, అందుకు ఇప్పటి నుంచే పిల్లలతో మొక్కలు నాటించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఆయన పిల్లలు దాస్యం కృషిక భాసర్-కృష్ణవ్ భాసర్ల 5వ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో గురువారం బాలసముంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘పర్యావరణ పరిరక్షణకు మేము సైతం‘ అంటూ పారిజాతం మొకలు, నూరు వరాల మొకలను చీఫ్‌విప్ దంపతులతో కలిసి పిల్లలు నాటారు. అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ పిల్లలకు మొక్కల సంరక్షణ అలవాట్లు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పచ్చదనం పెంపొందించేందుకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి విజయం సాధించారన్నారు. అందుకే హైదరాబాద్‌కు హరిత నగరంగా అవార్డు వచ్చిందన్నారు. కేసీఆర్ హరిత హారాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించి, విశ్వవ్యాప్తం చేశారన్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించిందని చీఫ్‌విప్ తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే తన పిల్లల జన్మదినం సందర్భంగా మొకలు నాటించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అనంతరం పిల్లల జన్మదినాన్ని పురస్కరించుకుని హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రానికి రూ.30వేల విలువ చేసే కుర్చీలను చీఫ్‌విప్ అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, పిన్నింటి విజయ్‌కుమార్, ప్రణయ్, ప్రవీణ్, మల్లికాంబ మనోవికాస కేంద్రం నిర్వాహకులు బండా రామలీల, సదానందం, కోడెం కల్యాణ్ పాల్గొన్నారు.
చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్-రేవతి దంపతుల పిల్లలకు పలువురు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆశీర్వాదం అందించారు. హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియా గార్డెన్లో పిల్లల పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎంపీ పసునూరి దయాకర్, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, వికలాంగుల సంస్థ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, టీఎస్పీఎస్సీ సభ్యుడు కారం రవీందర్‌రెడ్డి, ఉద్యోగ జేఏసీ మాజీ చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీఎన్జీవో నాయకులు ఆకుల రాజేందర్, పుల్లూరి వేణుగోపాల్, టీజీవో నాయకుడు జగన్మోహన్రావు, ట్రెస్సా నాయకుడు రాజ్‌కుమార్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
వరంగల్ : చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్- రేవతి దంపతులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారి కుమారుడు, కూతురు జన్మదినం సందర్భంగా అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దాస్యం కుటుంబ సభ్యులకు మహా మండపంలో మహాశీర్వచనం చేసి, అమ్మవారి శేష వస్ర్తాలను అందజేశారు.