వరంగల్ నగరాన్ని సాంస్కృతిక, సాహిత్య రంగాలకు నిలయంగా మార్చేందుకు ప్రభుత్వం కాళోజీ కళా క్షేత్రాన్ని నిర్మిస్తున్నది. ఇందుకోసం హనుమకొండ బస్ స్టేషన్ సమీపంలోని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మైదానంలో 4.25 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రూ.50 కోట్లతో కళాక్షేత్రం నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. పనులను వచ్చే జనవరి లోపు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఏడాది మేలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, పర్యాటక శాఖ, జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. వేగంగా పూర్తిచేసేందుకు కుడాకు పనులు అప్పగించారు. నాలుగు అంతస్తుల సువిశాల భవనంలో 1500 సీటింగ్ సామర్థ్యంతో ఒక ఆడిటోరియం, మినీ మీటింగ్ హాల్, డైనింగ్ హాల్స్, వీఐపీ సూట్స్‌ను అత్యాధునికంగా నిర్మిస్తున్నారు.
వరంగల్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లుతున్న వరంగల్‌కు మరింత గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నగరాన్ని సాంస్కృతిక, సాహిత్య రంగాలకు నిలయంగా మార్చే లక్ష్యంతో కళా క్షేత్రాన్ని నిర్మిస్తున్నది. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా రచనలు చేసిన కాళోజీ నారాయణరావు పేరుతో దీన్ని చేపట్టింది. కాళోజీ కళాక్షేత్రం పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటి వరకు పర్యాటక శాఖ పర్యవేక్షణలో జరుగుతున్న పనులను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పూర్తి చేసేలా ఆదేశాలు ఇచ్చింది.
కళా క్షేత్రం నిర్మాణ పనులలో జాప్యాన్ని నివారించేందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అధికారులకు ఇటీవలే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాళోజీ కళాక్షేత్రం పనులను వచ్చే జనవరి లోపు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఏడాది మేలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, పర్యాటక శాఖలతోపాటు జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో పనులు వేగంగా పూర్తవుతాయనే ప్రతిపాదనలతో ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. కళా క్షేత్రం పనులు త్వరగా పూర్తయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేస్తున్నది.
ఆరు దశాబ్దాల అలుపెరుగని పోరాటంతో సాధించిన తెలంగాణ రాష్ట్రం సొంత సాంస్కృతిక, సాహిత్య వైభవాన్ని చాటుకోవాలనే లక్ష్యంతో… కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ దిశగా చర్యలు చేపట్టారు. వరంగల్ నగరంలో సాంస్కృతిక, సాహిత్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వరంగల్ నగరానికి వచ్చిన కేసీఆర్ కళా క్షేత్రం పనులను ప్రారంభించారు. మొదట ఎకరంలోనే రూ.15 కోట్లతో నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు.
ఆ మేరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో వరంగల్‌కు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత భవనం నిర్మాణ డిజైన్, కళా క్షేత్రం నిర్మించే విస్తీర్ణంలో కీలకమైన మార్పులు చేశారు. భవనం విశాలంగా ఉండాలనే ఉద్దేశంతో రూ.50 కోట్లతో కళా క్షేత్రం నిర్మించేందుకు ఆమోదం తెలిపారు. 4.25 ఎకరాలలో కాళోజీ కళా క్షేత్రం నిర్మించాలని నిర్ణయించారు. హనుమకొండ బస్టాండ్ సమీపంలోని విశాలమైన కుడా గ్రౌండ్లో నాలుగు అంతస్తులతో కాళోజీ కళా క్షేత్రం నిర్మించేలా కొత్త ప్రతిపాదనలు ఆమోదించారు.
ఈ భవనం సాంస్కృతిక, సాహిత్య కేంద్రం అనిపించేలా భవనం డిజైన్‌ను సిద్ధం చేశారు. నాలుగు అంతస్తుల సువిశాల భవనంలో 1500 సీటింగ్ సామర్థ్యంతో ఒక ఆడిటోరియం, మినీ మీటింగ్ హాల్, డైనింగ్ హాల్స్, వీఐపీ సూట్స్‌ను అత్యాధునికంగా నిర్మిస్తున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధుల్లోని రూ.25 కోట్లు వెంటనే విడుదల చేశారు. అనంతరం భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో కళా క్షేత్రం నిర్మాణ పనులో కొంత స్తబ్దత నెలకొన్నది. ఇటీవలే మళ్లీ పనులు వేగం పుంజుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు కారణాలను సామాన్య ప్రజలకు తెలిసేలా కాళోజీ నారాయణరావు ఎన్నో రచనలు చేశారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎలుగెత్తి చాటేవారు. అందుకే కాళోజీకి ప్రజాకవి అని పేరు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన నినాదంతో రచనలు చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవం సందర్భంగా వరంగల్ నగరంలో ‘కాళోజీ కళా క్షేత్రం’ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం సాంస్కృతి, సాహిత్య కార్యక్రమాలు అంటే హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఒక్కటే గుర్తుకువస్తున్నది. రవీంద్రభారతి కంటే విశాలంగా, ఆధునిక హంగులతో కాళోజీ కళా క్షేత్రం భవనం ఉండనున్నది. జనవరిలోపు పూర్తి చేసి ప్రారంభించేలా పనులు జరుగుతున్నాయి.