సంగెం, అక్టోబర్ 20: పైలేరియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గవిచర్ల మోడల్స్కూల్లో పైలేరియా వ్యాధి నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ విద్యార్థినులకు మందులు అందించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో మందు లు అందజేస్తున్నట్లు చెప్పారు.
అంగన్వాడీ, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మాత్రల పంపిణీని విజయవంతం చేయాలని సూచించారు. ప్రజలకు సంక్రమిత, అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల్లోని విద్యార్థులందరికీ మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కందకట్ల కళావతి, డాక్టర్ పొగాకుల అశోక్, సర్పంచ్ దొనికెల రమ-శ్రీనివాస్, ఎంఈవో ఎన్ విజయ్‌కుమార్, ఎంపీటీసీ గూడ సంపత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ముజుబుర్ రహమాన్, ఎస్ఎంసీ చైర్మన్ బలరాం, గవిచర్ల వైద్యురాలు నాగమణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.