ఖిలావరంగల్, అక్టోబర్ 20: జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగుల శబ్దాలకు ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈదురుగాలులతో వర్షం రావడం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఖిలావరంగల్ మధ్యకోటలోని వ్యవసాయ పంట భూముల్లో వర్షపునీరు చేరింది. సీసీ రోడ్డుపై మోకాలు లోతు వర్షం నీరు నిలిచింది. జిల్లావ్యాప్తంగా మోస్తారు వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వరంగల్ మండలంలో 9.2 సెంటీమీటర్లు, వర్ధన్నపేటలో 0.7 సెం.మీ., గీసుగొండలో 6.1, దుగ్గొండిలో 6.2, నల్లబెల్లిలో 3.6, నర్సంపేటలో 5.2, ఖానాపూర్‌లో 2.1, చెన్నారావుపేటలో 4.2, సంగెంలో 3.2, నెక్కొండలో 2.0, రాయపర్తిలో 1.1, పర్వతగిరిలో 0.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నర్సంపేటరూరల్/నర్సంపేట: నర్సంపేట పట్టణంతోపాటు మండలవ్యాప్తంగా కురిసిన వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిలోని పాకాల వాగు గురువారం ఉధృతంగా ప్రవహించింది. మండలంలోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండి మత్తడి దుంకుతున్నాయి. వందలాది ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. ముగ్దుంపురం, పాతముగ్దుంపురం, నాగుర్లపల్లి, లక్నేపల్లి, మాదన్నపేట, భాంజీపేట, ముత్తోజిపేట, రాజుపేట, ఇటుకాలపల్లి, మహేశ్వరం, మాదన్నపేటలో పత్తి, మక్కజొన్న, మిరప పంటల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది.