సంగెం, అక్టోబర్ 20 : ఆస్తికోసం తోడబుట్టిన తమ్ముడినే హత్య చేసి ప్రమాదశాత్తు మృతిచెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసిన అన్నను, ఆయనకు సహకరించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సంగెం పోలీస్‌స్టేషన్‌లో ఈస్ట్‌జోన్ డీసీపీ కే వెంకటలక్ష్మి గురువారం వెల్లడించారు. మండలంలోని రాంచంద్రాపురం గ్రామానికి చెందిన మారబోయిన బాలరాజు సెప్టెంబర్ 26న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతడి తల్లి రెండు రోజులు తెలిసిన వాళ్ల ఇళ్లు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకి లభించకపోవడంతో సెప్టెంబర్ 28న తన కొడుకు అదృశ్య మయ్యాడని సంగెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
29న రాయపర్తి రిజర్వాయర్‌లో మగ వ్యక్తి శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన వెంటనే పోలీసులు బాలరాజు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రిజర్వాయర్‌లో శమమైన వ్యక్తి మారబోయిన బాలరాజుగా అతని కుటుంబ సభ్యులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఎస్సై దేవేందర్ బాలరాజు చనిపోయే ముందు సెల్పోన్లో ఎవరెవరితో మాట్లాడాడో టెక్నికల్ సపోర్టుతో గుర్తించారు. బాలరాజు అన్న మారబోయిన కుమారస్వామి తన తమ్ముడికి ఉన్న నాలుగెకరాల భూమిని కాజేసేందుకు హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారం జఫర్గడ్ మండలం తమ్మడపల్లి(జీ) గ్రామానికి చెందిన నక్క సుధాకర్‌తో పాటు గవిచర్ల గ్రామానికి చెందిన తన బావ మరిది బోల్ల రాజుతో కలిసి పథకం పన్నాడు. ఇందులో భాగంగా మారబోయిన బాలరాజుకు నక్క సుధాకర్ గవిచర్లలో మద్యం తాగించి రాంచంద్రాపురం గ్రామ శివారులోని కల్వర్టు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి కుమారస్వామికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న కుమార స్వామి తన బావ మరిది బోల్ల రాజుతో కలిసి కల్వర్టు వద్దకు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న తమ్ముడు బాలరాజును కర్రతో కొట్టి తర్వాత తువ్వాలతో ఉరిబిగించి చంపేసాడు. చనిపోయిన తర్వాత బాలరాజు శవాన్ని మోటర్‌బైక్‌పై తీసుకెళ్లి షాపురం బ్రిడ్జి వద్ద మెయిన్ కెనాల్లో పడేశారు. బాలరాజు బైక్‌ను మారబోయిన కుమారస్వామి వ్యవసాయ బావిలో పడేసి ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోయారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న ఎస్సై పెండ్యాల దేవేందర్, పర్వతగిరి సీఐ అనుముల శ్రీనివాస్ సిబ్బందితో టెక్నికల్ సపోర్ట్ ఆధారంగా నిందితులను గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నక్క సుధాకర్, మారబోయిన కుమారస్వామి, బోల్ల రాజు ఉన్నారు. చంపడానికి ఉపయోగించిన కర్ర, రెండు బైక్స్, మూడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన ఎస్సై దేవేందర్, సీఐ శ్రీనివాస్, పర్యవేక్షించిన మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్, పోలీసు సిబ్బందిని ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి అభినందించారు.