వరంగల్, అక్టోబర్ 18: నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. డివిజన్లలో నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేటర్లు సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది. సుమారు 3 గంటలపాటు కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరిగింది. ముఖ్యంగా మిషన్ భగీరథ, తాగునీటి పైపులైన్ లీకేజీలు, పారిశుధ్యం, విద్యుత్ స్తంభాల సమస్యలపై సభ్యులు గళమెత్తారు. మిషన్ భగీరథ పనులు నత్తనడకపై సమావేశంలో సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. డివిజన్లలో తాగునీటి పైపులైన్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వాపోయారు. నగరంలో వందల సంఖ్యలో లీకేజీల ఉన్నా మరమ్మతులు చేయడం లేదని పలువురు కార్పొటర్లు మండిపడ్డారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంజూరైన అభివృద్ధి పనులు నెలలు గడుస్తున్నా కార్యరూపం దాల్చడం లేదని పేర్కొన్నారు.
అధికారుల తీరుపై ఆగ్రహం
సమావేశంలో కార్పొరేటర్లు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులపై అధికారుల తీరు మారాలన్నారు. గత కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్‌కు మంజూరు చేసిన రూ. 50 లక్షల నిధులకు సంబంధించిన పనులు ఇప్పటికీ చేపట్టడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా ప్రారంభించలేదన్నారు. అధికారులు కౌన్సిల్ తీర్మానాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నగరంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు.
కౌన్సిల్‌కు మునుగోడు ఎఫెక్ట్
గ్రేటర్ కౌన్సిల్ సమావేశానికి మునుగోడు ఉప ఎన్నిక ఎఫెక్ట్ పడింది. ఎక్స్ ఆఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఒక్కరు కూడా సర్వసభ్య సమావేశానికి హాజరుకాలేదు. వారు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉండడంతో కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో పాటు పలువురు కార్పొరేటర్లు సైతం ఎమ్మెల్యేల వెంట మునుగోడు ప్రచారంలో ఉండడంతో కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరయ్యారు.
స్వచ్ఛ ఆటోల ఈఎంఐకి రూ.71,31,960
ఎజెండా అంశాలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. కౌన్సిల్ సమావేశం ముందుకు వచ్చిన 3 అంశాలకు ఆమోదం తెలిపారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్ కం ఓనర్ పథకం కింద కొనుగోలు చేసిన 163 స్వచ్ఛ ఆటోలకు జూలై 2022 నుంచి డిసెంబర్ 2022 కాలానికి ఈఎంఐ రూ. 71,31,960 చెల్లించనున్నారు. విధి నిర్వహణలో ట్రాక్టర్‌పై నుంచి పడిపోయి ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికుడు మట్టెడ ఆశోక్ కుటుంబానికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా చెల్లించే అంశానికి సభ్యులు ఆమోదముద్ర వేశారు. ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కోచ్ కాంట్రాక్టు కాలం ముగియడంతో మరో ఏడాది పొడిగిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. సమావేశంలో కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటి మేయర్ రిజ్వానా షమీమ్ పాల్గొన్నారు.
పర్యాటక నగరంగా అభివృద్ధి – గుండు సుధారాణి, మేయర్
చారిత్రక వరంగల్‌ను పర్యాటక నగరంగా అభివృద్ధి చేసేలా అడుగులు వేస్తున్నాం. వరంగల్ నగరం యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో ఎంపిక కావడం సంతోదాయకం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గ్రేటర్‌కు జాతీయ స్థాయిలో 62వ ర్యాంకు, తెలంగాణ స్థాయిలో 2వ ర్యాంకు వచ్చింది. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంతి కేటీఆర్ సహకారంతో నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. పట్టణ ప్రగతి, జనరల్ ఫండ్, స్మార్ట్‌సిటీ, కార్పొరేషన్ సాధారణ నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం.