ఖానాపురం, అక్టోబర్ 18: సస్యరక్షణ చర్యలతోనే అధిక దిగుబడి సాధించొచ్చని ఏడీఏ అవినాశ్వర్మ అన్నారు. ఖానాపురం, రంగాపురంలో వరి, పత్తి పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు. వరిలో గోధుమ వర్ణపు ఆకుమచ్చ తెగులు ఆశించిందని, నివారణకు ప్రాపికోనజోల్ 250 మిల్లీ లీటర్లు ఎకరానికి పిచికారీ చేయాలని సూచించారు. అనంతరం రంగాపురంలో సాగు చేసిన అధిక సాంద్రత గల పత్తి పంటను పరిశీలించారు. ఒక్కో చెట్టుకు 30 నుంచి 35 కాయలు వచ్చాయని తెలిపారు. ఇదే విధానంలో రైతులు పత్తి సాగు చేస్తే అధిక లాభాలు ఆర్జించొచ్చని తెలిపారు. ఆయన వెంట ఏవో శ్రీనివాసరావు, ఏఈవోలు సంధ్య, నాగరాణి ఉన్నారు.
తెగుళ్లపై జాగ్రత్తలు తీసుకోవాలి : ఏవో
వర్ధన్నపేట: రైతులు పంటలను ఆశిస్తున్న తెగుళ్లపై జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో రాంనర్సయ్య సూచించారు. ఆన్లైన్లో పంటల నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన ల్యాబర్తి గ్రామంలో క్షేత్ర సందర్శన చేశారు. ఈ సందర్భంగా వరి పంటలో ఆశిస్తున్న తెగుళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. పంటలకు తెగుళ్లు ఆశించి దిగుబడి తగ్గితే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ముందుగానే అప్రమత్తమై ఎప్పటికప్పుడు ఏఈవోల సహకారంతో పంటలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవాలని సూచించారు. అలాగే, రైతులు తమ పంటల వివరాలను సర్వే నంబర్ల ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కోరారు. తద్వారా అధికారులు పంట దిగుబడిని అంచనా వేసేందుకు సులభతరం అవుతుందన్నారు. ఆ తర్వాత పంట కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేస్తారని వివరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని విక్రయించుకునేందుకు రైతులకు ఇబ్బందులు ఉండవని ఏవో అన్నారు. ఆయన ఏఈవోలు, రైతులు ఉన్నారు.
అధిక వర్షాలతో ఇబ్బందులు
నర్సంపేట: ఈ నెలలో నర్సంపేట డివిజన్లో కురుస్తున్న అధిక వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి. ఓ పక్క ఎండ కాస్తున్నది. మరోపక్క వాన పడుతుండడంతో ప్రస్తుతం పత్తి పంటలో పూత, కాత రాలిపోతున్నదని రైతులు చెబుతున్నారు. అలాగే, వర్షపు నీరు పత్తి పంటలో నిలిచి జాలువారుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటలోనూ తెగులు, పురుగు ఉద్ధృతి పెరుగుతున్నది. ప్రజలు కూడా సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నట్లు పేర్కొంటున్నారు.