జనగామ రూరల్, అక్టోబర్ 18: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఆసరాగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దీనిని ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని పెంబర్తి సమీపంలోని నందన్ గార్డెన్లో ఉపాధి హామీ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం పనుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ బావుల మోటర్లకు మీటర్లు పెడితే రూ.30 వేల కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తే సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని ఎర్రబెల్లి చెప్పారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ పాలకులు కక్ష సాధింపు చర్యలకు పా ల్పడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టమని కేసీఆర్ స్పష్టం చేశారని తెలిపారు. ఉపా ధి హామీ పనుల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలువడంతో కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులు ఇచ్చిందని ఎర్రబెల్లి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ పనుల తనిఖీల పేర ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. పనులు చేయకుండా ఎక్కడా నిధులు వినియోగించలేదన్నారు.
కేంద్ర బడ్జెట్లో ఉపాధిహామీ నిధులకు కోత..
ఉపాధి హామీ నిధులకు కేంద్ర బడ్జెట్లో నిధులకు కోత విధించారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈ బడ్జెట్లో రూ.75 వేల కోట్లు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించి కూలీలకు పనులు కల్పిస్తున్నదన్నారు. సమైక్య పాలనలో గ్రామాలు ఎలా ఉన్నాయి.. రాష్ట్రం వచ్చాక ఎలా ఉన్నాయో పరిశీలిస్తే తెలుస్తుందన్నా రు. నేడు గ్రామాల్లో పరిశుభ్రతతో పాటు పచ్చదనం వెల్లివిరిస్తున్నదన్నారు. హరితహారంతోపాటు వైకుంఠ ధామా లు, చెత్త డంపింగ్ యార్డులు నిర్మించడంతో పల్లెలు ప్రగతిపథంలో ఉన్నాయని ఎర్రబెల్లి తెలిపారు. జన్‌ధన్ ఖాతా లు తీసుకున్న ప్రజల బ్యాంకు అకౌంట్లలో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తామన్నా ప్రధాని మోదీ అమలు చేయలేదన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచడం తో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదలు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్రంలోని ఉపాధి హామీ ఉద్యోగుల మాదిరిగా దేశంలోని ఏ రాష్ట్రంలో జీతాభత్యాలు లేవన్నారు. అయినా వారికున్న సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని, త్వరలోనే మీకు తీపి కబురు ఉంటుందని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లిని ఉపాధిహామీ ఉద్యోగులు సన్మానించారు. ఇదిలా ఉండగా ఇటీవల మృతి చెందిన ఉపాధి హామీ కంప్యూటర్ ఆపరేటర్ కుటుంబానికి రూ.లక్ష చెక్కును మంత్రి ఎర్రబెల్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, టీఆర్ఎస్వీకే రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, ఈజీస్ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ లింగ య్య, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.