కురవి, అక్టోబర్17 : నిరుపేదల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. దేశ తలరాతను మార్చేందుకే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారని, ఈ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కురవి మండలంలో అంతర్భాగంగా ఉన్న సీరోలు గ్రామం కేంద్రంగా నూతన మండలాన్ని సోమవారం ఆమె డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, కలెక్టర్ శశాంకతో కలిసి ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ తహసీల్ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించగా, కలెక్టర్ సమక్షంలో ఇన్చార్జి తహసీల్దార్ కే విజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా అండగా నిలువాలన్నారు. అభ్యర్థితో పనిలేకుండా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి అండగా నిలుస్తాయన్నారు. పేదల గుండెల్లో ఆయనకు సుస్థిర స్థానం ఉంటుందన్నారు. సీరోలు అంటేనే జ్ఞప్తికి వచ్చే మాజీ ఎమ్మెల్సీ వెడెల్లి వెంకట్‌రెడ్డి కోరిక నెరవేరిందన్నారు.
ప్రజాప్రతినిధులు ప్రజల విశ్వసనీయతను దక్కించుకునేందుకు నిత్యం పాటుపడాలని ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతితండాను గ్రామపంచాయతీగా చేసినట్లు తెలిపారు. 10శాతం రిజర్వేషన్ పెంపుతో గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో మూడు నదులుంటే అన్నింటిపై చెక్‌డ్యాంలు నిర్మించినట్లు తెలిపారు.
సీరోలు మండల ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని మాజీ ఎమ్మెల్సీ వెడెల్లి వెంకట్‌రెడ్డి అన్నారు. అన్ని అర్హతలున్న సీరోలును మండలంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్‌కు స్వయంగా లేఖ రాసినట్లు తెలిపారు. మండల ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎంపీ కవితకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కురవి ఎంపీపీ గుగులోత్ పద్మావతి, మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బజ్జూరి ఉమ తదితరులు పాల్గొన్నారు.