ఏటూరునాగారం, అక్టోబర్ 17: స్థానిక ఆధ్వర్యంలో మంగళవారం 3వ రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈమేరకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఉట్నూరు ఐటీడీఏ, తదితర ప్రాంతాలకు చెందిన గిరిజన క్రీడాకారులు బస్సుల్లో సోమవారం సాయంత్రం నుంచి ఏటూరునాగారానికి చేరుకుంటున్నారు. ఆయా క్రీడాకారుల కోసం ఐటీడీఏలు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాయి. స్కౌట్ విద్యార్థులు అతిథులను సాదరంగా ఆహ్వానించేందుకు రిహార్సల్ చేస్తున్నారు. క్రీడామైదానంలో ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు క్రీడాకారులను కోర్టులను సిద్ధం చేస్తున్నారు. కొత్తగా వేదికను నిర్మించారు. క్రీడా పోటీలు నిర్వహించే కొమురంభీమ్ స్టేడియం ఎదురుగా ఉన్న పీఎంఆర్సీ ఆవరణలో విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు క్రీడాకారులు బస చేసేందుకు ఆరు చోట్ల ఏర్పాట్లు చేశారు. ఈక్రీడల్లో సుమారు 1,668 మంది క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. ప్రారంభ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకు కూడా ఏర్పాట్లలో అధికారులు లీనమయ్యారు.