పత్తి కొనుగోళ్లకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మార్కెట్లో తెల్లబంగారానికి మంచి డిమాండ్ ఉండడంతో ఈ సారి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాది రైతులు 1,09,007 ఎకరాల్లో సాగు చేయగా, ఇప్పుడు 1,30,968 ఎకరాల్లో పంట వేశారు. 1,21,753 టన్నుల దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగా జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ బీ గోపి వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మద్దతు ధరతో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రాల్లో వేయింగ్ మిషన్లు, వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ క్రమంలో సీసీఐ ద్వారా కలెక్టర్కు ప్రతిపాదనలు అందగానే నోటిఫికేషన్ ఇచ్చేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
వరంగల్, అక్టోబర్ 17 (నమస్తేతెలంగాణ) : జిల్లాలో పత్తి పంట సాగు విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా దిగుబడులు కూడా పెరుగుతాయని అధికారులు భా విస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి పత్తి కొనుగోలుకు సమాయత్తమవుతున్నారు. గత ఏడాది వా నకాలం జిల్లాలో రైతులు 1,09,007 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. దిగుబడి 96,263 టన్నులు వ చ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం 1,30,968 ఎకరాలకు ఎగబాకింది. దీంతో 1,21,753 టన్నుల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేశారు. మార్కెట్లో పత్తికి ఈ ఏడాది కనీస మద్దతు ధర కూడా పెరిగింది.
గత ఏడాది ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ పొడవు పింజరకం పత్తికి రూ.6,025, మధ్యరకం పత్తికి రూ.5,726 ఉండగా ఈ ఏడాది పొడవు పింజ రకం పత్తికి రూ.6,380, మధ్యరకానికి రూ.6,280 ఉంది. పెరిగిన ఈ కనీస మద్దతు ధర అమల్లోకి వచ్చింది. కొద్దిరోజుల నుంచి కొత్త పత్తి దిగుబడులు రావడం మొదలైంది. ఎప్పటికప్పుడు రైతులు పత్తిని మార్కెట్కు తరలించి అమ్ముతున్నారు. ప్రస్తుతం సోమవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.7,890, మాడల్ ధర రూ.7,500, కనిష్ఠ ధర రూ.6 వేలు పలికింది. 4,464 క్వింటాళ్ల పత్తి ఈ మార్కెట్కు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
దీన్ని పూర్తిగా మార్కెట్లోని వ్యాపారులే కొనుగోలు చేశారు. కొత్త పత్తి దిగుబడులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో మార్కెట్కు రాబడులు క్రమేనా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దీపావళి పండుగ సమీపించడంతో ఆర్థిక అవసరాలను తీర్చుకొనేందుకు రైతులు పత్తిని ఎక్కువ మొత్తంలో మార్కెట్కు తరలిస్తారని అధికారులు భావిస్తున్నారు. కొద్ది రోజుల నుంచి మార్కెట్లో పత్తికి పలుకుతున్న ధరలను విశ్లేషిస్తున్న మార్కెటింగ్ శాఖ అధికారులు రైతులకు ప్రభుత్వ మద్దతు ధర దక్కే దిశగా అడుగులు వేస్తున్నారు.
మార్కెట్లో పత్తికి మద్దతు ధర లభించని సమయంలో ప్రభుత్వం జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. నిబంధనల ప్రకారం మద్దతు ధరతో ఈ కేంద్రాల ద్వారా పత్తిని కొనుగో లు చేస్తుంది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం కలెక్టర్ బీ గోపి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మార్కెటింగ్, వ్యవసాయ, తూనికలు కొలతలు, సీసీఐ తదితర శా ఖల అధికారులతో పాటు జిల్లాలోని జిన్నింగ్ మిల్లు ల యజమానులు, రైతు సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైతుల నుంచి మద్ద తు ధరతో పత్తి కొనుగోళ్ల ప్రతిపాదనలపై సమీక్ష జరిపారు.
గతంలో జిన్నింగ్ మిల్లుల్లో నిర్వహించిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో కల్పించిన వసతులు, జరిగిన కొనుగోళ్ల వివరాలను తెలుసుకున్నారు. ఈ ఏడాది కూడా వీటిల్లో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరతో రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిన్నింగ్ మిల్లులో వేయింగ్ మిషన్తో పాటు కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
వరంగల్, నర్సంపేట, నెక్కొండ, వర్ధన్నపేట ప్రాంతాల్లో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సీసీఐ ద్వారా కలెక్టర్కు ప్రతిపాదనలు అందగానే నోటిఫికేషన్ ఇచ్చేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి ప్రసాదరావు తెలిపారు.