ఖిలావరంగల్, అక్టోబర్ 16 : గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 121 సెంటర్లలో ఆదివారం పరీక్ష నిర్వహించారు. మొత్తం 42,519 మంది అభ్యర్థులకు 33,557 మంది హాజరయ్యారు. 8952 మంది గైర్హాజరయ్యారు. 78.94 శాతం హాజరు నమోదైంది. రెండు గంటల ముందే అభ్యర్థులు సెంటర్లకు చేరుకున్నారు. వారిని సిబ్బంది తనిఖీ చేసి లోనికి పంపించారు. పరీక్ష కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. సిబ్బందికి తగు సూచనలిచ్చారు. సెంటర్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
జిల్లాలో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు కలెక్టర్ బీ గోపి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, పోలీసు సిబ్బంది పరీక్ష విధులు నిర్వర్తించారు. పరీక్ష రాసే అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలకు సులువుగా వెళ్లేందుకు రూట్ మ్యాప్‌లు, అందుకు తగినట్లు రవాణా వ్యవస్థను సిద్ధం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 9716 మంది అభ్యర్థులకు 7374 మంది పరీక్ష రాయగా 2342 మంది హాజరు కాలేదు. మొత్తం 75.90 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దేశాయిపేట, పోచమ్మమైదాన్, కరీమాబాద్, ఖిలావరంగల్, శంభునిపేట, బొల్లికుంట ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ సందర్శించారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులతో మాట్లాడారు. పరీక్ష పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కరీమాబాద్ : అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని పలు సెంటర్లలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మిల్స్‌కాలనీ సీఐ ముష్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీమాబాద్, రంగశాయిపేట. శంభునిపేట, ఫోర్టురోడ్ ప్రాంతాల్లోని కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మామునూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు సెంటర్ల వద్ద సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.
చిన్నారిని లాలించిన వరంగల్ ఏసీపీ..
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలను వరంగల్ ఏసీపీ గిరికుమార్ కలకోట పరిశీలించారు. ఫోర్టురోడ్డులోని ఏఎస్ఎం కళాశాలలో పరీక్ష సెంటర్‌కు విధులు నిర్వర్తిస్తుండగా, అక్కడ ఓ చిన్నారి ఏడుపును గమనించాడు. చిన్నారి తల్లి పరీక్ష రాస్తున్నదని తెలుసుకుని కాసేపు పాపను ఎత్తుకుని లాలించాడు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించాడు. కాగా, ఏసీపీ చిన్నారిని ఎత్తుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.