హనుమకొండ, అక్టోబర్ 16 : గ్రామ పంచాయతీల్లో పూర్తిస్థాయి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు మాన్యువల్‌గా జారీ చేస్తున్న అన్ని రకాల సర్టిఫికెట్లు, రసీదులు, రిజిస్టర్లు ఆన్లైన్ ద్వారా జారీ చేయనున్నారు. మెరుగైన పౌరసేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థలో పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి పల్లెల రూపు రేఖలు మార్చిన ప్రభుత్వం తాజాగా అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతోపాటు కంప్యూటర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ ఉన్న గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ సౌకర్యం కల్పించగా, త్వరలోనే మరికొన్నింటికి ఇంటర్నెట్, ఆన్లైన్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో 15 రకాల సేవలు అందిస్తున్నారు.
ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్లు, రసీదులు
పౌరులకు మెరుగైన, సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేస్తోంది. ఈ క్రమంలో కొన్నింటికి కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించగా, కొన్ని పంచాయతీలకు వైఫై, మరికొన్నింటికి మొబైల్ డేటా ద్వారా (తాత్కాలికం) జారీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్థిక సంఘం నిధుల వినియోగం విషయంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు కూడా డిజిటల్ కీ ఇచ్చి ఆన్లైన్లో ఆదాయ, వ్యయాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఇతర రసీదులు, సర్టిఫికెట్లను సైతం ఆన్లైన్ ద్వారా జారీ చేసేందుకు పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారులు డిజిటల్ కీలు అందజేస్తున్నారు.
జిల్లాలో 208 గ్రామ పంచాయతీలు
జిల్లాలో 208 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు ఇప్పటికే కొన్నింటికి కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. ఇంకా కొన్ని పంచాయతీల్లో కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, 208 గ్రామ పంచాయతీలకు 109 జీపీల్లో కంప్యూటర్లు ఏర్పాట్లు చేశారు. వీటిలో 38 పంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉండగా, 71 పంచాయతీల్లో మొబైల్ డేటా వినియోగిస్తున్నట్లు పీఆర్ అధికారులు తెలిపారు. అదేవిధంగా మిగిలిన 99 గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపించామని చెప్పారు.
ఆన్లైన్ ద్వారా అందించే సేవలు
జీపీల్లో ఆన్లైన్ ద్వారా 15 రకాల సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో జీపీ కోడ్, జీపీ ప్రొఫైల్, పంచాయతీల అకౌంట్స్ అప్డేషన్, జీపీల ఆస్తుల వివరాలు, జీపీ యూఆర్సీ, గ్రామ పంచాయతీల ఆడిట్ వివరాలు, పంచాయతీల అవార్డులు, రోజువారీగా పారిశుధ్య వివరాలతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పన్నుల రసీదులు, భవన నిర్మాణ అనుమతులు, షాపుల లైసెన్స్, ఇంటి పన్ను డిమాండ్ లాంటి సేవలను అందిస్తున్నారు.