రాయపర్తి, అక్టోబర్ 16: సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ శ్వాసపై ధ్యాస నిలిపితే సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చనని నేరెళ్ల వేణుమాధవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ నేరెళ్ల శోభావతి అన్నారు. మండలంలోని కొండాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ధ్వన్యనుకరణ సామాట్ నేరెళ్ల వేణుమాధవ్ చారిటబుల్ ట్రస్ట్ సారథ్యంలో మిమిక్రీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన పాఠశాల స్థాయి విద్యార్థులకు రెండు రోజులుగా నిర్వహిస్తున్న మిమిక్రీ వర్క్‌షాపు ఆదివారం ముగిసింది. సర్పంచ్ కోదాటి దయాకర్‌రావుతో కలిసి నేరెళ్ల శోభావతి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు అన్నారు. పల్లెటూరి పిల్లల్లో ప్రతిభాపాటవాలు, సృజనాత్మక శక్తులకు కొదువలేదని, విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తియుక్తులను గురువులు సరైన సమయంలో గుర్తించి, వెలికి తీస్తే వారు భవిష్యత్‌లో జాతి గర్వించే బిడ్డలుగా ఎదుగుతారని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు క్రమం తప్పకుండా యోగా, మెడిటేషన్ చేయాలన్నారు. అనంతరం వర్క్‌షాపులో భాగస్వాములైన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో బుల్లితెర ఆర్టిస్ట్ లోహిత్కుమార్, హెచ్ఎం ఎం సమ్మయ్య, చంద్రముఖి-చంద్రశేఖర్, పీ వెంకటస్వామి, విజయ్‌కుమార్, శిక్షకులు హరిప్రసాద్, సంతోష్‌కుమార్, ఇమిటేషన్ రాజు, బిట్ బాక్సర్ ఆజాద్, గాదె శ్రీనివాస్, యాకాంబ్రం పాల్గొన్నారు.