న్యూశాయంపేట, అక్టోబర్ 16 : క్రెడిబులిటీ ఉన్న సంస్థ క్రెడాయి ద్వారా నగర ప్రజలు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చని మేయర్ గుండు సుధారాణి అన్నారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్లో క్రెడాయి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన ముగింపు సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఎస్ సుందర్‌రాజ్‌యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ రంగానికి వరంగల్ నగరం అనుకూలంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా వరంగల్‌ను ఫ్యూచర్ పట్టణంగా మార్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్ మాట్లాడుతూ.. నగరాభివృద్ధి కావాలంటే డెవలపర్స్ బిల్డర్స్ సమన్వయం, క్రెడాయి సూచనలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లోని కంపెనీలన్నీ వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం, యాజమాన్యాలు సానుకూలంగా ఉన్నాయని వివరించారు. క్రెడాయి రాష్ట్ర అధ్యక్షుడు ఈ ప్రేమ్‌సాగర్‌రెడ్డి, జగన్మోహన్, శరత్‌బాబు, సత్యనారాయణరెడ్డి, జే మనోహర్, రవీందర్‌రెడ్డి, వరుణ్అగర్వాల్, యూత్ వింగ్ బాధ్యులు పాల్గొన్నారు.