గోవిందరావుపేట, అక్టోబర్ 16 : లక్నవరంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. వేలాడే వంతెనలపై నడుస్తూ బోటింగ్ పాయింట్‌కు చేరుకున్నారు. అనంతరం సరస్సులో బోటు షికారు చేస్తూ ప్రకృతి అందాలకు మంత్రముగ్ధులయ్యారు.
ప్రకృతి సోయగాలతో పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకట్టుకుంటున్న లక్నవరం సరస్సుకు విదేశీ విద్యార్థులు కూడా వస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆరుగురు విద్యార్థులు, హైదరాబాద్‌కు చెందిన ఎనిమిది, బెంగళూరుకు చెందిన ఒకరు లక్నవరం సరస్సును సందర్శించారు. సరస్సు అందాలపై అధ్యయనం చేస్తూ శిక్షణలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని కొంపెల్లి అభయ స్కూల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులతో పాటు హైదరాబాద్ విద్యార్థులు బోట్లు, ఇంజిన్ల తయారీపై అధ్యయనం చేశారు. స్కూల్ టీచర్ జేష్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు విద్యా బోధనతో పాటు బోట్ల తయారీ, వాటిల్లో వాడే మోటర్, ఇతర పరికరాల పనితీరుపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పాఠశాలలు మన దేశంలో ఏడు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. అందులో ఒకటైన తమ స్కూల్‌కు చెందిన 9, 10 తరగతుల విద్యార్థులకు శిక్షణలో పాల్గొన్నట్లు చెప్పారు. లక్నవరం పరిసరాలను సందర్శించి నమూనా చిత్రాలను చిత్రీకరించామని, జీపీఎస్ ద్వారా సరస్సు విస్తీర్ణం, ఇక్కడ ఉన్న సదుపాయాలపై వివరాలు సేకరించినట్లు వివరించారు.