హనుమకొండ, అక్టోబర్ 15 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో చరిత్రలో నిలిచేలా వరంగల్ నగరం అభివృద్ధి చెందుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. క్రెడాయి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన హనుమకొండ హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్లో రెండు రోజుల ప్రాపర్టీ షోను చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి షోలను హైదరాబాద్‌లాంటి నగరాల్లో మాత్రమే చూశానని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రియల్ ఎస్టేట్ రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. ఈ ప్రదర్శనలో ప్రతి ఒకరి బడ్జెట్‌కు తగినట్లుగా ఆస్తులను ప్రదర్శించడంతో పాటు వరంగల్‌లోని నివాసితుల అత్యుత్తమ అవసరాలను తగిన విధంగా ఉన్నాయని కొనియాడారు.
వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలోని అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, వాణిజ్య స్థలాల వంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల గురించి ఈ ప్రాపర్టీ షో ద్వారా తెలుసుకునే మంచి అవకాశం ప్రజలకు లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు, అమలు చేస్తున్న విధానాలు, కార్యక్రమాల వల్ల అనేక సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనుబరుస్తున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతున్నదన్నారు.
తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ హైదరాబాద్‌ను మించి అభివృద్ధి చెందుతోందన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో వరంగల్ నగరం చరిత్రలో నిలిచేలా అభివృద్ధి చెందడం ఖాయమని మంత్రి స్పష్టం చేశారు. రూ.1,300 కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, టీఎస్-బీపాస్ విధానాలతో పారిశ్రామిక రంగంలో నిర్మాణ అనుమతులు ఏ రాష్ట్రంలో లేని విధంగా వెంటనే ఇస్తున్నట్లు చెప్పారు.
వరంగల్ నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, అందులో భాగంగా నూతన మాస్టర్ ప్లాన్‌తో పాటు ఎయిర్ పోర్టు పునరుద్ధరణ, ఔటర్ రింగ్ రోడ్డు, నియో రైలు మార్గాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. వరంగల్ నగరంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఎక్కడా లేని విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు, కాటన్ ఇండస్ట్రీలు రాగా, కాకతీయ మెగా టెక్స్ టైల్ పారు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అంతేకాకుండా వేస్ట్ ప్లాస్టిక్ ద్వారా కూడా బట్టలు తయారు చేసే కంపెనీ సైతం నెలకొల్పారన్నారు. తద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో అక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిందన్నారు. వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందడంతో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడానికి అపార అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయంపై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇటీవల వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కరుణాపురం వద్ద పరిస్థితిని వివరించగా వెంటనే సీఎం స్పందించి అక్కడ మరో బ్రిడ్జి నిర్మించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఈఎన్సీకి ఆదేశించారన్నారు.
వేగంగా ట్రైసిటీ అభివృద్ధి..
రాష్ట్ర ఏర్పాటు అనంతరం వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఇలాంటి ప్రాపర్టీ షోలు గతంలో మెట్రో నగరాల్లో మాత్రమే జరిగేవని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అమలు చేస్తున్న ప్రణాళికల నేపథ్యంలో రెండోసారి వరంగల్ నగరంలో క్రెడాయి ప్రాపర్టీ షో నిర్వహించడం అభినందనీయమన్నారు.
తాను కూడా వచ్చే రెండు సంవత్సరాల్లో క్రెడాయి సహకారంతో ప్రాపర్టీ కోనుగోలు చేస్తానని చీఫ్ విప్ తెలిపారు. సీఎం కేసీఆర్‌కు అన్ని రంగాల్లో అనుభవం ఉందని, తాను కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు భవన నిర్మాణాలకు అనుమతి రావాలంటే ఇబ్బందులు ఉండేవని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే వరంగల్ నగరం ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందని చెప్పారు.
అదేవిధంగా హెల్త్, కల్చరల్, టూరిజం, స్పోర్ట్స్ హబ్‌గా మారుతుందన్నారు. వరంగల్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారని, అందులో భాగంగానే ముంబాయి పుణె హైవే మాదిరిగా హైదరాబాద్-వరంగల్ హైవేను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. మీ ప్రాజెక్టుల వద్ద పనిచేసే భవన నిర్మాణ కార్మికులకు లేబర్‌కార్డులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని బిల్డర్లు, క్రెడాయి బాధ్యులను చీఫ్ విప్ కోరారు.
అనంతరం క్రెడాయి ప్రతినిధులు మాట్లాడుతూ వరంగల్ నగరంలో ప్రాపర్టీ షో నిర్వహించడం ఇది రెండోసారి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రణాళిలతో వరంగల్ నగరం చుట్టూ 40 కిలోమీటర్ల మేర అభివృద్ధి చెందుతున్నదన్నారు. గతంలో నిర్వహించిన ప్రాపర్టీ షోకు 1200 మంది వచ్చారని, ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రాపర్టీ షోను తిలకించి మీ కలలను నిజం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్రెడాయి ప్రతినిధులు ఈ ప్రేమ్‌సాగర్‌రెడ్డి, జగన్మోహన్, శరత్‌బాబు, సత్యనారాయణరెడ్డి, జే మనోహర్, ప్రేమ్‌సాగర్‌రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, రాంరెడ్డి, అమరలింగేశ్వర్రావు, ఎం రవీందర్‌రెడ్డి, క్రెడాయి యూత్ వింగ్ బాధ్యులు పాల్గొన్నారు.