పట్టణ ప్రగతి, నగర బాటలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. శానిటేషన్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. నగరంలో పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు చేసి, తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని పేర్కొన్నారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఈనెల 31తో ముగియనున్న వన్‌టైం సెటిల్మెంట్ స్కీం (ఓటీఎస్) పై బకాయిదారులకు అవగాహన కల్పించి, వంద శాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు.
-వరంగల్, అక్టోబర్ 15
వరంగల్, అక్టోబర్ 15: పట్టణప్రగతి కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి శనివారం ఆమె అభివృద్ధి పనుల పురోగతి, పట్టణప్రగతి, నగరబాటలో గుర్తించిన సమస్యలపై సమీక్షించారు. వార్డుల వారీగా గుర్తించిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నాలుగో విడుతలో గుర్తించిన శానిటేషన్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నగరబాటలో గుర్తించిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రేటర్ కార్పొరేషన్లో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో పైపులైన్ల లీకేజీలను గుర్తించి మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఈ నెల 31తో వన్‌టైం స్కీం గడువు ముగుస్తున్న తరుణంలో బకాయిదారులకు అవగాహన కల్పించి వసూలు చేయాలని అధికారులకు సూచించారు. వందశాతం పన్నుల వసూళ్లకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలన్నారు. సమావేశంలో ఎస్ఈ ప్రవీణ్‌చంద్ర, సీపీ వెంకన్న, డిప్యూటీ కమిషనర్లు జోనా, శ్రీనివాస్‌రెడ్డి, ఈఈలు శ్రీనివాసరావు, సంజయ్‌కుమార్, రాజయ్య, బీఎల్ శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ ఈఈ రాజ్‌కుమార్, డీఈ శ్రీనాథ్‌రెడ్డి, డీఈలు రవికుమార్, సంతోష్‌బాబు, సారంగం పాల్గొన్నారు.
స్వయంఉపాధి రంగాల్లో మహిళలకు శిక్షణ
స్వయం ఉపాధి రంగాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి అన్నారు. కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవన్లో 11, 15, 16, 17, 29 డివిజన్లకు చెందిన ఆదర్శ పట్టణ సమాఖ్య సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మేయర్ హాజరై మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ పొంది ఆర్థికంగా ఎదగాలన్నారు.
వరంగల్ ప్రాంతంలో శానిటరీ న్యాప్కిన్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలను ప్రోత్సహించాలన్నారు. మూస ధోరణిలో కాకుండా విభిన్న ఆలోచనలతో వ్యాపార మార్గాలను అన్వేషించాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో స్వయం సహాయక సంఘాలు ప్రత్యామ్నయంగా జ్యూట్ బ్యాగులు, గుర్రపు డెక్కలతో తయారయ్యే ఉత్పత్తులపై దృష్టి సారించాలని కోరారు. స్వయం సహాయక సంఘాలు, పట్టణ సమాఖ్యలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించేలా ఆర్పీలు చర్యలు తీసుకోవాలన్నారు.
పంచసూత్రాలు తప్పకుండా పాటించాలన్నారు. సర్వసభ్య సమావేశాలు, ఆడిటింగ్లు, పొదుపు చెల్లింపులు, రుణాల కిస్తీల చెల్లింపులు సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. స్థానిక కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ డివిజన్లలో స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ఆర్పీలు కృషి చేయాల న్నారు. సమావేశంలో టౌన్ ప్రాజెక్ట్ అధికారి విజయలక్ష్మి, డీఎంసీలు రజితారాణి, రేణుక, సీవోలు ప్రవీణ్, రజిత, ఆర్పీలు పాల్గొన్నారు.