నయీంనగర్, అక్టోబర్ దేశ నిర్మాణంలో నిట్ విద్యార్థులు కీలకపాత్ర పోషించారని విశిష్ట శాస్త్రవేత్త, హైదరాబాద్ డీఆర్డీవో అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రామమనోహర్బాబు అన్నారు. నిట్ 64వ స్థాపక దినోత్సవం సందర్భంగా సాంకేతిక వృత్తి, పౌర, ప్రజాసేవతో సహా సమాజానికి సేవచేయడం, పూర్వవిద్యార్థుల విజయాలు, శ్రేష్టతను గుర్తించేందుకు విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డులను ఏర్పాటు చేశారు. ఈమేరకు ఎంపిక చేసిన 21 మంది పూర్వ విద్యార్థులకు వరంగల్ నిట్ అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వరంగల్ నిట్ ఎంతో పేరున్న సంస్థ అని, నిట్ అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు సమాజానికి చేస్తున్న సేవలు సంస్థ గర్వించేలా ఉన్నాయని, సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని తెలిపారు.
కొవిడ్ సమయంలోనూ ప్రజలకు సహాయకారిగా ఉన్నారని, సంస్థ విద్యార్థులకు 400 ల్యాప్‌టాప్‌లను కూడా అందజేశారని పేర్కొన్నారు. నిట్‌ను అభివృద్ధి చేయడంలో పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో ఉందన్నారు. అనంతరం 21మంది పూర్వ విద్యార్థులకు అలుమ్ని అవార్డులను ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్ అండ్ ఏఏ అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ అజీమ్, వరంగల్ నిట్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త వీఏ శాస్త్రి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
డీజీపీ మహేందర్‌కు ఘనస్వాగతం
వరంగల్ నిట్‌లో సివిల్ ఇంజినీర్ పూర్తిచేసిన రాష్ట్ర పోలీసు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి 64వ నిట్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనకు వరంగల్ కమిషనరేట్‌కు చెందిన డీసీపీలు, అదనపు డీసీపీలు, ఇన్స్పెక్టర్లు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందచేసి, పోలీసులు గౌరవందనం చేశారు.