నర్సంపేట రూరల్, అక్టోబర్10 : పోడు రైతులకు హక్కు పత్రాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని ఎంఏఆర్ ఫంక్షన్హాల్లో ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులకు అటవీ భూముల సర్వేపై శిక్షణా శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. పోడు రైతులకు న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ సర్వే చేపట్టారని తెలిపారు.
అర్హులకు మేలు జరిగేలా ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు కృషి చేయాలని ఆయన కోరారు. సర్వే అధికారులకు పోడు రైతులు సహకరించాలన్నారు. పోడు రైతుకు న్యాయం చేసే బాధ్యత ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులదేనని పెద్ది స్పష్టం చేశారు. చట్టానికి లోబడి రైతులు నడుచుకోవాలని, అధికారులు సమన్వయంతో సర్వే నిర్వహించాలన్నారు.
నర్సంపేట నియోజకవర్గంలో 22 వేల ఎకరాల్లో ఉన్న అటవీ భూముల సమస్య ప్రభుత్వ నిర్ణయంతో త్వరలో పరిష్కారమవుతుందన్నారు. డివిజన్లో 35 గ్రామ పంచాయితీలకు అటవీ పోడు భూముల సమస్య ఉందని, ఇందులో నాన్ ట్రైబల్స్ 3,985 మంది, ట్రైబల్స్ 3,726 మంది హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేశారని ఆయన వివరించారు. ప్రస్తుతం తెలంగాణ భూభాగంలో 21 శాతం విస్తీర్ణంలోనే అడవులున్నాయని తెలిపారు. అడవులపై ఆధారపడి జీవించే వారి మనుగడకు సహకరించాలన్నారు.
అడవులను పరిరక్షించేందుకు అనేక చట్టాలున్నప్పటికీ పలుచోట్ల ఉల్లంఘన జరుగుతున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారని, ఇందులో భాగంగానే పోడు భూములను సాగు చేస్తున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించి అసెంబ్లీలో ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.
అటవీ హక్కుల కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు సాగుదారుల నుంచి వచ్చిన దరఖాస్తులు పరిశీలించి సర్వే చేపడుతామని పేర్కొన్నారు. త్వరలో నిజమైన హక్కుదారులను గుర్తించి హక్కు పత్రాలు ఇస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీటీడీవో జాకీర్ హుస్సేన్, ఆర్డీవో మహేందర్‌జీ, ఏసీపీ సంపత్‌రావు, జడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, డీఆర్డీవో సంపత్‌రావు, ఎఫ్ఆర్వో రమేశ్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.