స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 9 : ఈయేడు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో జిల్లాలో పత్తి సాగు ఆశాజనకంగా ఉంది. వానకాలం సీజన్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు భూగర్భ జలాలు పెరగడంతో బోరు బావుల్లో తగినంత నీరుంది. ఫలితంగా తెల్ల బంగారం దిగుబడులు ఆశీంచిన రీతిలో ఉంటాయని రైతులు భావిస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో గత సంవత్సరం 1,46,416 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఈ సంవత్సరం వానకాలం సీజన్లో 1,40,878 ఎకరాల్లో వేశారు. జూన్ మాసంలో వర్షాలు కురిసిన ప్రదేశాల్లో పత్తి సాగు చేయగా, జూలైలో విస్తారంగా కురవడంతో అన్ని మండలాల్లో సాగైంది. ఎకరానికి సుమారు ఎనిమిది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పత్తి పూత దశలో ఉం డగా, కొన్ని ప్రాంతాల్లో కాయలు కాస్తున్నాయి. తెగుళ్ల బెడద అంతటా లేకపోవడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు.
గత సంవత్సరం పత్తి సాగు చేసిన రైతులకు మంచి ధర లభించింది. క్వింటాలుకు రూ.8 వేల వరకు లభించడంతో లబ్ధి పొందారు. ఎకరం వరి సాగు చేస్తే ఖర్చులు మినహాయించి సుమారు రూ. 25 వేల వరకు ఆదాయం లభించిం ది. పత్తి ఎకరంలో సాగు చేస్తే రూ. 35 వేల వరకు లాభాలు సాధిం చామని పలు వురు రైతులు తెలిపా రు. వరి కంటే పత్తి వేస్తే మార్కెట్ గిట్టు బాటు ధర లభించ డంతో ఆర్థికంగా రైతు కు మేలు జరుగుతుం దని వ్యవసాయదా రులు భావిస్తున్నారు.
పత్తి పంట ఆశాజనకంగా ఉండడంతో దిగుబడులు పెరిగే అవకాశముంది. అయితే ఇదే సమయంలో తెగుళ్లు ఆశించే అవకాశముండడంతో వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి ఆకులు, కాయలకు గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశముంది. దీంతోపాటు బూడిద తెగులు లేదా కాయకుళ్లు తెగులు ఆశించే అవకాశముందంటున్నారు. చీడ లను గుర్తించడానికి పత్తి రంగు మారితే తెగులు సోకినట్లు భావించవచ్చు. ఇలాంటి సమయంలో అక్కడక్కడ పత్తి కాయలను వొలిచి చూస్తే గులాబీ రంగు పురుగు, కాయకుళ్లు గమనించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. బూడిద తెగులు లేదా గ్రే మిల్ట్యూ సోకితే ఆకులపై కోణాకారపు తెల్లటి మచ్చలు ఏర్పడుతా యి. కాయ కుళ్లు తెగులు ఆశిస్తే పత్తి పంట కా య దశలో ఉన్నప్పుడు వర్షాలు అధికంగా ఉం టే అనేక రకాల శిలీంధ్రాలు ప్రవేశించడంతో కాయలు కుళ్లిపోతాయి. వీటిని నిరంతరం పరిశీలించి నివారణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులను కోరుతున్నారు.
పత్తి పంట సాగు చేస్తే రైతు లకు ఆర్థికంగా మేలు జరుగు తుంది. గత సంవత్సరం నుంచి పత్తికి మంచి ధర లభిస్తున్నది. క్వింటాలుకు రూ.8 వేలకుపై గానే లభించింది. వాణిజ్య పం టల్లో ప్రధానంగా పత్తి, మిర్చి సాగు చేస్తే రైతులకు పెట్టుబడి ఖర్చులు పోను లాభాలు వస్తాయి. ప్రస్తుతం జిల్లాలో పత్తి సాగు ఆశాజనకంగా ఉంది. పంటను రైతులు పర్యవేక్షించాలి. గులాబీరంగు తెగులు, బూడిద తెగులు సోకితే లింగాకర్షక బుట్టలు అమర్చాలి. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పురుగు మందులు వినియోగించాలి.
– వినోద్‌కుమార్, ఏడీఏ జనగామ