పెద్దవంగర, అక్టోబర్ 9 : దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ల పీడ పోవాలంటే కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్తోనే అది సాధ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో రూ.కోటితో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి కలెక్టర్ శశాంకతో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే 107 మహిళా సంఘాలకు మంజూరైన రూ.6 కోట్ల బ్యాంకు రుణాలను వారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా అనేక మండలాలు ఏర్పాటు చేసుకున్నామని, మొట్టమొదటిసారిగా పెద్దవంగర మండలంలోనే తహసీల్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అక్కడే మరో రూ.కోటితో ఎంపీడీవో కార్యాలయం నిర్మిస్తామన్నారు. కొత్తగా ఏర్పడిన పెద్దవంగర మండల అభివృద్ధికి రూ.70కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం లబ్ధి పొందేవిధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటూ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని అన్నారు.
గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా సీఎం కేసీఆర్ ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించారని, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్లు తెలిపారు. దళితబంధు పథకంలో భాగంగా నియోజకవర్గానికి 1500 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందిస్తున్నామని, రానున్న మూడేళ్లలో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఇచ్చే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మతం పేర ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ఊళ్లలోకి రాకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? ప్రజలు గమనించాలన్నారు. కేంద్రం పెద్దలు రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నారని, వాటి ఆటలు తెలంగాణలో సాగవన్నారు. ప్రజలను ఆగం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పీడ వదిలేలా ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
నూతనంగా ఏర్పడిన పెద్దవంగర మండలంలో ప్రభు త్వ కార్యాలయాల నిర్మాణానికి సర్వే నం.522లో 1.20 ఎకరాల భూమిని దానంగా ఇచ్చిన కేతిరెడ్డి సోమనర్సింహారెడ్డి, జాటోత్ నెహ్రూనాయక్, పాలకుర్తి యాదగిరిరావు, అనబత్తుల ప్రభాకర్‌రావు, అనబత్తుల నాగేశ్వరరావు, ముప్పాల సురేశ్‌బాబు, చెరుకు మహేశ్వర్‌రెడ్డి, పసులేటి వెంకట్రామయ్యను మంత్రి అభినందించారు. మండల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. పరిపాలనా సౌల భ్యం కోసం ఏర్పాటు చేసుకున్న మండలాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, దాతల సహకారం ఎంతో ముఖ్యమని కలెక్టర్ శశాంక అన్నారు. కార్యాలయ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. భూదానం చేసిన దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఎంపీపీ రాజేశ్వరి, జడ్పీటీసీ జ్యోతిర్మయి, ఎంపీటీసీ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఎస్ఈ రఘువీరారెడ్డి, ఆర్డీవో రమేశ్, ఏఈ సురేశ్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్యశర్మ, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు నెహ్రూనాయక్, మండల సభ్యుడు సోమనర్సింహారెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మం డల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, మండల మాజీ అధ్యక్షుడు పాలకుర్తి యాదగిరిరావు, నాయకులు సుధీర్‌కుమార్, శ్రీనివాస్, సుధాకర్, వెంకన్న, వెంకట్రామయ్య, రవి, సోమ న్న, సమ్మయ్యయాదవ్, మల్లికార్జునాచారి, లింగమూర్తి, సమ్మయ్య, భిక్షపతి, యూత్ నాయకులు హరీశ్, అనుదీప్, వెంకటేశ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నెల్లికుదురు, అక్టోబర్ 9 : నిత్యం ఎంత బీజీగా ఉన్నా.. ప్రజలతో మమేకమవడంలో మంత్రి ఎర్రబెల్లి ముందుంటారు. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకోవడంతోపాటు సరదాగా గడపడంలో ఆయనకు ఆయనేసాటి. ఆదివారం సాయంత్రం ఆయన నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామంలో తమ సమీప బంధువు బియ్యాల మోహన్‌రావు దశ దినకర్మకు హాజరై తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎర్రబెల్లిగూడెం శివారులో రోడ్డు పక్కన కుంటలో చేపలు పడుతున్న చిన్నారులను చూసి మురిసిపోయారు. వెంటనే తన కారు ఆపి వారితో కలిసి కుంటలో గాలం వేసి చేపలు పట్టారు. కాసేపు సరదాగా గడిపారు.