నగరంలో మావోయిస్టుల అరెస్టు కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి వైద్యం కోసం ఇద్దరు మహిళా నక్సలైట్లు అక్కడి కాంగ్రెస్ నాయకుడితో కలిసి కారులో హనుమకొండకు వస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వరంగల్ కమిషనరేట్ పోలీసులు వారిని నగర శివారులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరు మహిళా మావోయిస్టుల్లో ఒకరు బస్తర్ ఏరియా దళ కమాండర్ ఉన్నట్లు తెలిసింది. ఈ ముగ్గురిని హనుమకొండకు రప్పించడానికి ఏర్పాట్లు చేసిన ములుగు జిల్లాకు చెందిన మరో ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. సోమవారం పోలీసులు వీరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
సుబేదారి, అక్టోబర్ 9 : వరంగల్ నగరంలో ఇద్దరు మహిళా మావోయిస్టులతోపాటు ఓ సానుభూతిపరుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల మావోల కదలికలు లేవు. ఈ క్రమంలో నక్సల్స్ ఏకంగా వరంగల్ నగరానికి రావడంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళా కమాండర్‌తోపాటు మరో మహిళా మావోయిస్టు వైద్యం కోసం అక్కడి కాంగ్రెస్ నాయకుడి సాయంతో మూడు రోజుల క్రితమే భూపాలపట్నం మీదుగా గుట్టుచప్పుడుకాకుండా కారులో హనుమకొండకు వస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.
దీంతో వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. మావోయిస్టులు ప్రయాణిస్తున్న కారును వరంగల్ నగర శివారులో పట్టుకున్నారు. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా మావోయిస్టులు, ఛత్తీస్‌గఢ్ భూపాలపట్నానికి చెందిన సానుభూతిపరుడు, కాంగ్రెస్ నేతను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులకు పట్టుబడిన ఇద్దరు మహిళా మావోయిస్టుల్లో ఒకరు బస్తర్ ఏరియా దళ కమాండర్ ఉన్నట్లు తెలిసింది. ఈ ముగ్గురిని హనుమకొండకు రప్పించడానికి ఏర్పాట్లు చేసిన ములుగు జిల్లాకు చెందిన ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ఐదుగురిని పోలీసులు విచారిస్తున్న వినికిడి. సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.