దసరా పండుగ ముగియడంతో జనం సొంతూళ్ల నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సోమవారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానుండడంతో ఆదివారం హనుమకొండ బస్‌స్టేషన్‌కు జనం పోటెత్తారు. ఉమ్మడి వరంగల్‌లోని గ్రామీణ ప్రాంతాల నుంచి జనం హైదరాబాద్, వరంగల్ నగరానికి తరలివెళ్తున్నారు. ఆర్టీసీకి వారం రోజుల పాటు ఇదే రూట్ల నుంచి జనం తాకిడి ఉంది. రద్దీకనుగుణంగా బస్సులు నడిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
– హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 9
పండుగ సెలవులు పూర్తి కావడంతో ఆర్టీసీకి జనం తాకిడి ఎక్కువైంది. వరంగల్ రీజియన్‌లోని పరకాల, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, నర్సంపేట బస్స్టేషన్లు, ప్రధానంగా హనుమకొండ బస్‌స్టేషన్ ఆదివారం ప్రయాణికులతో నిండిపోయాయి. బస్సుల కోసం జనం బారులు తీరారు. ఆయా డిపోలకు చెందిన అధికారులు బస్స్టేషన్లలో బస్సుల రాకపోకలను పర్యవేక్షించారు. హనుమకొండ బస్‌స్టేషన్‌లో జనం తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆర్ఎం శ్రీదేవి, వరంగల్-1,2 డిపో మేనేజర్లు, సిబ్బంది ప్రయాణికులను వెనువెంటనే బస్సుల్లో ఎక్కించి పంపించారు.
హనుమకొండ బస్‌స్టేషన్‌లోని హైదరాబాద్ పాయింట్ల వద్ద బస్సుల కోసం జనం క్యూ కట్టారు. ఆదివారం సెలవుదినం కావడం తెల్లవారే సోమవా రం నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతుండ డం, విధుల్లో చేరడానికి ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రైవేటు రంగాల్లో పనిచేసే వారు వేలాదిగా హైదరాబాద్‌కు వెళ్లడానికి హనుమకొండ బస్సేష్టన్కు చేరుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఒక్క ఆదివారమే హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి హైదరాబాద్‌కు సుమారు 500కుపైగా ట్రిప్పులు నడిపినట్లు అధికారులు తెలిపారు. ఇవేకాకుండా ఆన్లైన్ రిజర్వేషన్, హైదరాబాద్ మీదుగా బెంగళూర్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, శ్రీశైలం, మిర్యాలగూడ, ఇతర దూరప్రాంతాలకు సర్వీసులు నడిపారు. వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ, అద్దె, సిటీ బస్సులు మొత్తం 942 ఉన్నాయి. వీటిలో సగానికి పైగా హైదరాబాద్ రూట్‌కే కేటాయించడం విశేషం.
వరంగల్-హైదరాబాద్ రూట్లో జనం రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు నడుస్తున్న సర్వీస్‌లను రద్దు చేసి హైదరాబాద్ రూట్లో నడపడంతో గ్రామీణ ప్రజలు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ములుగు, ఏటూరునాగారం, భూపాలపల్లి, నర్సంపేట, తొర్రూరు , పాలకుర్తి, ధర్మసాగర్, వరంగల్ సిటీ ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించారు.
వరంగల్ రీజియన్ నుంచి హైదరాబాద్‌కు ఆదివారం 150 అదనపు సర్వీసులను ప్రారంభించాం. ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా బస్సులను నడిపిస్తున్నాం. రద్దీ ఉన్న రూట్లలో ఎక్కువగా తిప్పుతున్నాం. హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ పెరిగింది. రాత్రి వరకు సుమారు 500 ట్రిప్పులు హైదరాబాద్‌కు తిప్పాం. ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా హనుమకొండ బస్‌స్టేషన్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.
– శ్రీదేవి, ఆర్టీసీ ఆర్ఎం