కరీమాబాద్, అక్టోబర్ 9: ఏండ్ల తరబడి మొండి గోడలతో దర్శనమిచ్చిన కళాభవనం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముస్తాబవుతున్నది. ఓరుగల్లు కళలలకు పుట్టినిల్లు. కళామతల్లి ముద్దు బిడ్డలయిన కళాకారులకు ఇక్కడ కొదవలేదు. కొందరికి నాటకమంటే పిచ్చి.. మరి కొందరికి నాటకమంటే ప్రాణం.. సమాజంలో జరిగే విషయాలను కళ్లకు కట్టినట్టుగా చూపి మనుషుల్లో చైతన్యం కలిగించేది నాటకం. అలాంటి నాటకాలనే తమ జీవితాలుగా భావించి, నాటక రంగానికి తమ జీవితాలను అంకితం చేసిన వారెందరో ఇక్కడ ఉన్నారు. కళాకారులు నేటికీ నాటక రంగాన్ని వదలలేదు.
అంతరించిపోతున్న నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురావాలనే సంకల్పంతో 2004లో కళాభవనానికి ముహూర్తం పెట్టారు. కానీ, వారి కృషి ఫలించలేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కళాభవనం ప్రారంభానికి ముస్తాబవుతున్నది. కళాకారుల 18 ఏళ్ల నిరీక్షణ ఫలించనుంది. కళాభవనం గోడలకు వేసిన రంగు లు.. కళాకారుల నృత్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కళాకారుల కోసం నిర్మిస్తున్న ఈ కళాభవన నిర్మాణానికి అండగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కళాకారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కళలు, కళాకారులకు అండగా ఉన్నారని కొనియాడుతున్నారు.
కళాభవన నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిది. కళాభవన నిర్మాణం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూశాం. టీఆర్ఎస్ సర్కారు భవన నిర్మాణానికి నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వానికి కళాకారుల పక్షాన రుణపడి ఉంటాం. కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాటకాలను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తాం.
– కాజీపేట తిరుమలయ్య, ఓరుగల్లు కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కళాభవనంలో నాటకాలు వేసే రోజులు వస్తున్నాయి. 18 ఏళ్ల తర్వాత ప్రభుత్వ సహకారంతో కళాభవనం ప్రారంభానికి సిద్ధమవుతున్నది. నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రభుత్వం సైతం కళలను ఆదుకోవాలి. కళాకారులకు పలు రంగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నాటక రంగం మనుగడ కోసం యువత రావాలి.
– శతపతి శ్యామలరావు, ఓరుగల్లు కళాపరిషత్ ఉపాధ్యక్షుడు