మహబూబాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ త్వరలోనే మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. సోమవారం ఆమె జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జడ్పీచైర్‌పర్సన్ బిందుతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ త్వరలోనే జిల్లా పర్యటనకు వస్తున్నారని, నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, మెడికల్ కళాశాల భవనాలను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10శాతానికి పెంచిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా గిరిజనులందరూ సభకు హాజరు కావాలని కోరారు. ఈ నెల 5న జాతీయ పార్టీ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా జిల్లా కేంద్రానికి వస్తున్న ఘన స్వాగతం పలుకాలన్నారు. 1986లో 4 శాతం ఉన్న రిజర్వేషన్‌ను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 6 శాతానికి పెంచారన్నారు. అప్పటి నుంచి ఎస్టీ జనాభా గణనీయంగా పెరిగినా రిజర్వేషన్ పెంపును ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ 10 శాతానికి పెంచి గిరిజనులకు ఎంతో మేలు చేశారన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాలను 33 జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలతోపాటు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకొని ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కలెక్టర్‌ను కలువాలంటే ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల జిల్లా అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, క్షేత్రస్థాయిలో తిరుగుతున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌తోపాటు మెడికల్ కళాశాల నిర్మాణ పనులు తుది దశకు చేరాయన్నారు. వీటికి ఇరువైపులా జాతీయ రహదారులు మంజూరై మానుకోట ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మహబూబాబాద్ మండలం మల్యాలలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన జీవోను ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. ఈ ఏడాది నుంచే మెడికల్ కళాశాల ప్రారంభం కానుందని, 150 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు త్వరలో జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మెహన్‌రెడ్డి, మూల మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు.