నర్సంపేట రూరల్, మార్చి 1 : గ్రామంలో పూజలకు నోచుకోని పురాతన శివాలయం ఉంది. కానీ శివరాత్రి రోజున భక్తులు నర్సంపేట పట్టణంలోని ఆలయానికి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో యువత ఏకమై గ్రామంలో ఉన్న శివాలయాన్ని తీర్చిదిద్ది కొత్త శోభ తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో శివాలయం ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. మూడు దశాబ్దాలుగా ధూపదీప నైవేద్యాలు లేవు. ఆలయం చుట్టూ చెట్లు పెరిగి భక్తులు వెళ్లేందుకు దారి కూడా లేదు. దీంతో గ్రామంలోని యువత స్వచ్ఛందంగా ముందు కు వచ్చి గుడి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించారు. దేవాలయం ఆవరణను శుభ్రం చేశారు. ఆలయానికి రంగులు వేసి అలంకరించారు. మహాశివరాత్రి వేళ గ్రామస్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివాలయాన్ని తీర్చిదిద్ది శివరాత్రి రోజున అందుబాటులోకి తీసుకురావడంతో గ్రామపెద్దలు యువత మేడి రంజిత్, చిదురాల రాఘవేంద్ర, వీరమల్ల మధు, శ్రీధర్, రంగనాథరెడ్డి, ప్రసాద్, సంతోష్, బొంత రంజిత్‌ను అభినందించారు.