ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తున్న సర్కారు గర్భిణుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం సరికొత్తగా ‘కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్’ను అందుబాటులోకి తెస్తున్నది. రాష్ట్రంలో తొలివిడుతలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రరం భీం అసిఫాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. వచ్చే దసరా నాటికి కార్యాచరణలోకి రానుంది. ఆరోగ్యశాఖ నిర్వహించిన సర్వేలో పౌష్టికాహారలోపంతో అనేక మంది గర్భిణులు బాధపడుతున్నారు. దీనిని అదిగమించేందుకు ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు కలిగిన కిట్‌ను రెండు సార్లు గర్భిణికి అందించనున్నారు. మరోవైపు అత్యవసరమైతే తప్ప సిజేరియన్‌కు వెళ్లకుండా సాధారణ ప్రసవాలు జరిగేలా ఆరోగ్య శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 20: తల్లీబిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా కేసీఆర్ ‘న్యూట్రీషియన్ కిట్’ను త్వరలో అందించబోతున్నది. పుట్టిన బిడ్డ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన అన్ని రకాల వస్తువులను కానుకగా ఇవ్వనుంది. గర్భిణుల్లో చాలా మంది పౌష్టికాహార లోపానికితోడు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఫలితంగా సాధారణ ప్రసవాలకు బదులు సిజేరియన్ చేయాల్సి వస్తున్నది. శిశువుతోపాటు తల్లి ఆరోగ్యంగా లేకపోవడాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు సరికొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏఏ జిల్లాల్లో ఎక్కువ మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారనే విషయమై ఇటీవల సర్వే నిర్వహించింది. ఇందులో మొదటి విడుతగా తొమ్మిది జిల్లాలను ఎంపిక చేసింది. .
రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్లను తొలివిడుతలో అందించాలని సర్కారు నిర్ణయించింది. వీటిలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమురం భీం అసిఫాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో వచ్చే దసరా నుంచి అమలు చేయనుంది. పౌష్టికాహార లోపంతో గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. దీంతో పుట్టబోయే బిడ్డకు బరువు లోపించి, సరైన ఎత్తు పెరగకపోవడం కనిపిస్తుంది. దీనిని నివారించేందుకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ దోహదపడనుంది.
గర్భిణులకు రూ.2 వేల విలువైన న్యూట్రిషియన్ కిట్‌ను ఉచితంగా అందించనున్నారు. ఇందులో మిక్స్పౌడర్ డబ్బాలు రెండు, కిలో ఖర్జూర, మూడు బాటిళ్ల ఐరన్ టానిక్, కిలో నెయ్యి, ఐరన్ టాబ్లెట్లు, ఎండు ఖర్జూర, ఆల్బెండజోల్ మాత్రల షీట్ ఉంటాయి. వీటిని ప్లాస్టిక్ బాక్స్ షీట్లో అందించనున్నారు. ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు కలిగిన కిట్లను గర్భిణికి రెండు సార్ల చొప్పున అందిస్తారు. రెండో ఏఎన్సీ చెకప్ (గర్భం దాల్చిన మూడో నెల ), నాలుగో ఏఎన్సీ చెకప్ (ఐదోనెల)లో అందిస్తారు. అంటే ప్రతి గర్భిణికి రెండుసార్లు రూ.4 వేల విలువైన కిట్లను ప్రభుత్వం ఉచితం గా అందిస్తుంది. వీటి ద్వారా గర్భిణులకు పౌష్టికాహా రం లభించి, రక్తహీనత తగ్గి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.
పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణులకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ ఉపయోగంగా ఉంటుంది. గర్భంలో బిడ్డ ఎదుగదల లేక చివరికి సిజేరియన్లకు వెళ్తున్నారు. వీటికి కారణం తెలుసుకోవడంలేదు. సర్కారు దవాఖానలో మెరుగైన వైద్యం లభిస్తున్నా కొందరు ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్తున్నారు. అక్కడ అవసరం ఉన్నా లేకున్నా నార్మల్ డెలివరీకి బదులు సిజేరియన్ చేస్తున్నారు. అందుకే ప్రైవేట్ హాస్పిటల్స్‌పై నిఘా ఉంచాం. ప్రతి రోజు నివేదిక పంపాలని ఆదేశించాం. దీంతో కొంత అదుపులోకి వచ్చింది.
– డాక్టర్ శ్రీరాం, డీఎంహెచ్‌వో, భూపాలపల్లి