బీమా కుంభకోణంపై పోలీసులు జరుపుతున్న విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. డెత్ సర్టిఫికెట్ కోసం ఓ గ్రామ సర్పంచ్‌కు, ముఠా సభ్యులకు నగదు పంపకాలపై పంచాయితీ తలెత్తడంతో ఇన్సూరెన్సు స్కాం బయటపడినట్లు తెలుస్తోంది. ఎంక్వైరీలో భాగంగా ఇందులోని పాత్రధారులు, వారికి సహకరించిన వారి వివరాలను పోలీసులు సేకరించినట్లు చర్చ జరుగుతోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న 8 మందిలో ఇన్సూరెన్సు కంపెనీల్లో ఎంక్వైరీ ఆఫీసర్‌గా పనిచేసిన ఒకరు ఈ దందాలో కీలక పాత్ర పోషించినట్లు వినికిడి. స్నేహితులు, ఇతరుల సహకారంతో మొదట జిల్లాలోని వివిధ మండలాల్లో అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి కుంభకోణానికి స్కెచ్ వేశాడు.
వరంగల్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : బీమా కుంభకోణంపై జరుగుతున్న విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిసింది. ఈ స్కాం పాత్రధారులు ఇన్సూరెన్సు కంపెనీల నుంచి బీమా పేరుతో అందినకాడికి దోచుకొనేందుకు పోటీపడినట్లు సమాచారం. ఈ క్రమం లో ఎవరికివారే తామేమి తక్కువ కాదనే రీతిలో పక్కా స్కెచ్‌తో రూ.కోట్లు దండుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు తమ విచారణలో ఈ స్కాం పాత్రధారులు, వారికి సహకరించిన వారి వివరాలను సేకరించినట్లు తెలిసింది.
ఈ చీటర్స్ మోసం చేసిన ఇన్సూరెన్సు కంపెనీలకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. అనారోగ్యంతో ఉన్న వారి పేర వివిధ ఇన్సూరెన్సు కంపెనీల్లో పాలసీలు చేయడం, బ్యాంకుల నుంచి రుణాలు పొందడం వంటివి చేసి చనిపోయిన వ్యక్తుల బీమా మొత్తాన్ని తప్పుడు డాక్యుమెంట్లతో ఇన్సూరెన్సు కంపెనీల నుంచి పెద్ద మొత్తం లో డ్రా చేసుకున్న ముఠాలోని కొందరు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, రూ. కోట్ల బీమా కుంభకోణంపై లోతుగా విచారణ జరుపుతుండడం తెలిసిందే. పోలీసుల అదుపులో ఉన్న ముఠా సభ్యులు ఈ స్కాం ఎలా జరిగింది, ఇందులో ఎవరెవరు ఉన్నారు, వారికి సహకరించిందెవరు, అనారోగ్యంతో ఉన్న వారిలో ఇన్సూరెన్సు పాలసీలు చేసిందెవరి పేర?, బ్యాంకుల్లో వాహనాలు తీసుకుందెవరి పేర?, వీరిలో ఎవరి పేర ఎన్ని పాలసీలు చేశారు?, ఎన్ని వాహనాలు తీసుకున్నారు? అనే వివరాలను వెల్లడించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ కుంభకోణానికి పాల్పడిన ముఠా సభ్యుల్లో 25 పేర్లు ఇప్పటి వరకు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముఠా సభ్యుల్లో నల్లబెల్లి మండ లం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్న 8 మందిలో ఒకరు ఇన్సూరెన్సు కంపెనీల్లో ఇంక్వైరీ ఆఫీసర్‌గా పని చేసి కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అతనే తన స్నేహితులు, ఇతరుల సహకారంతో మొదట జిల్లాలోని వివిధ మండలాల్లో అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి కుంభకోణానికి స్కెచ్ వేశాడు.
ఈ క్రమం లో అనారోగ్యంతో ఉన్న వారి కుటుంబ సభ్యులతో ముందుగానే అవగాహన కుదుర్చుకుని అవసరమైతే తమకున్న నెట్‌వర్క్‌తో ఆధార్‌కార్డులోని వయస్సు మార్పిడి చేసి ఒక్కొక్కరి పేర వివిధ ఇన్సూరెన్సు కంపెనీల్లో రెండు మూడు పాలసీలు చేయడం, లేదా బ్యాంకుల్లో ఒక్కొక్కరి పేర రెండు మూడు వాహనాలను లోనుపై తీసుకోవడం వంటివి తన టీంతో కలిసి చేశాడు. ఇన్సూరెన్సు కంపెనీల్లో ఇంక్వైరీ ఆఫీసర్ అతనే కావడం వల్ల అనారోగ్యంతో ఉన్న వారి పేర పాలసీలు చేయ డం, వాహనాలు తీసుకోవడం, వారు చనిపోగానే వారి పేర బీమా మొత్తాన్ని ఇన్సూరెన్సు కంపెనీల నుంచి తీసుకోవడం వంటివి సులువుగా జరిగిపోయాయి. ఇలా కొన్నేళ్ల నుంచి ఈ టీం దందా జిల్లాతోపాటు పొరుగున ఉన్న మహబూబాబాద్, ములుగు, హనుమకొండ జిల్లాలకు విస్తరించింది.
విచారణలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు పోలీసులను సైతం ఆశ్చర్యపరుస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న స్కాం టీం సభ్యులో ఒకరు తన తండ్రి అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆయన పేర బ్యాంకుల నుంచి జేసీబీ, ట్రాక్టర్, డీసీఎం వ్యాన్ రుణంపై తీసుకున్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఈ మూడు వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్సు కంపెనీల నుంచి రూ.లక్షల బీమా మొత్తం డ్రా చేసుకున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు సమాచారం.
మరొకరు అనారోగ్యంతో ఉన్న ఓ మహిళ పేర ఇన్సూరెన్స్ కంపెనీల్లో మూడు పాలసీలు చేయగా, ఆమె చనిపోయాక వచ్చిన మూడు పాలసీల బీమా డబ్బుల డ్రా విషయంలో సమస్య తలెత్తినట్లు తెలిసింది. చనిపోయిన మహిళ పేర చేసిన మూడు పాలసీల్లో ఒక పాలసీపై పొరపాటున ఆమె కూతురు మొబైల్ నంబర్ పేర్కొనడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ బీమా మొత్తం రూ. 25 లక్షలను కూతురు పేర ఉన్న బ్యాంకు అకౌంట్లో జమ చేసింది. ఈ మేరకు మొబైల్‌కు మెసేజ్ రావడంతో కూతురు నేరుగా వెళ్లి బ్యాంకు నుంచి రూ. 25 లక్షలు డ్రా చేయడంతో తల్లి పేర ఇన్సూరెన్స్ పాలసీలు చేసిన వ్యక్తి ఇదేమిటని ప్రశ్నించడంతో వివాదం తలెత్తింది. దీన్ని కొందరు క్యాష్ చేసుకొని లబ్ధిపొందారు.
అంతేకాదు స్కాం టీం దందా తమ చెవిన పడితే అధికారులు కూడా సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. ఓ గ్రామంలో టీంలోని సభ్యుడు ఓ పాలసీ చేయగా చనిపోయాక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చిన బీమా మొత్తం పంపకంపై కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పగా… ఈ విషయం తెలుసుకున్న ఒక పోలీసు ఎస్సై టీం సభ్యుడి నుంచి రూ.లక్షలు గుంజారని తాజా పరిణమాలతో తెరపైకి వచ్చినట్లు తెలిసింది. ఇలా బీమా స్కాంతో పెద్ద మొ త్తంలో డబ్బు కూడబెట్టుకున్న టీంలోని సభ్యులు కొందరు రియల్ ఎస్టేట్, మద్యం వంటి వ్యాపారాల్లో అడుగుపెట్టినట్లు సమాచారం. స్కాం టీంలోని సభ్యుల నుంచి డబ్బు గుంజిన ఇతరుల చిట్టా పోలీసుల చేతికి అందినట్లు తెలిసింది.
పాలసీదారులు చనిపోయాక ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి బీమా మొత్తం డ్రా చేసుకోవడానికి డెత్ సర్టిఫికెట్లను సేకరించే సమయంలో స్కాం టీం సభ్యుల్లో కొందరికి వివిధ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సమస్యగా మారినట్లు తెలిసింది. నల్లబెల్లి మండలంలోని ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్‌తో స్కాం టీంలోని మెంబర్స్‌కు ఈ డెత్ సర్టిఫికెట్ల జారీ విషయంలో మొదట అవగాహన కుదిరినప్పటికీ తర్వాత విభేదాలు ఏర్పడినట్లు సమాచారం.
తాజాగా వరంగల్ నగర శివారులో ఉన్న ఓ మండలంలోని ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈ దందాకు సంబంధించి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడంపై రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని, అతడిని సంప్రదించిన టీంలోని సభ్యులు రూ.3 లక్షల వరకు ఇస్తామని చెప్పడంతో తలెత్తిన ‘పంచాయితీ’ తో స్కాం బయటపడినట్లు తెలుస్తోంది. ఈ గ్రామ పంచాయతీ నుంచే ఇన్సూరెన్సు స్కాం, పాత్రధారుల దందా పోలీసుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్కాం టీం సభ్యులను అదుపులోకి తీసుకోవడం మొదలు పెట్టారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇన్సూరెన్సు కుంభకోణం మొత్తం బయటపడుతున్నట్లు తెలిసింది. పోలీసులు ఏ క్షణంలో అయినా పట్టుకోవచ్చనే భయంతో స్కాం పాత్రధారుల్లో కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.
ఓరుగల్లు మహాసమాఖ్య(ఓఎంఎస్) కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను మంజూరు చేయాలని కోరుతూ జిల్లా అధ్యక్షురాలు మోటూరి శ్వేత శుక్రవారం తొర్రూరు క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మంత్రిని సన్మానించారు. కార్యదర్శి లలిత, కోశాధికారి ఇందిర, నాగరాణి, రాణిరుద్రమదేవి, అమరావతి, సరిత, మమత పాల్గొన్నారు.