స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు జనగామ కలెక్టరేట్లో మంగళవారం జాతీయ పతాకాల పంపిణీని ప్రారంభించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుమందు దేవీ సినిమా థియేటర్లో గాంధీ సినిమాను ప్రారంభించి, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి వీక్షించారు. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారయంత్రాంగానికి సూచించారు. అనంతరం రాయపర్తి మండలం మొరిపిరాల, మైలారం గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలను అందజేశారు.
జనగామ, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) /రాయపర్తి : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జనగామ కలెక్టరేట్లో జాతీయ జెండాల పంపిణీని మంగళవారం ప్రారంభించి, అధికారులతో సమీక్షించారు.
అంతకుమందు జిల్లా కేంద్రంలోని దేవీ సినిమా థియేటర్లో ‘గాంధీ’ సినిమాను ప్రారంభించి జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ టీ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, జడ్పీచైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి తిలకించారు. వజ్రోత్సవాల నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసి విజయవంతం చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఇంటికీ జాతీయ పతాకాన్ని అందించాలని సూచించారు. పంపిణీ చేసిన జెండాలను ప్రతి ఇంటిపై ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం కల్పించాలన్నారు. గ్రామగ్రామాన క్రీడాస్ఫూర్తిని నెలకొల్పేలా క్రీడా ప్రాంగణాల్లో ఫ్రీడం రన్ నిర్వహించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరికీ ఉచితంగా గాంధీ చలన చిత్రాన్ని ప్రదర్శిస్తున్నందన యజమానులకు సహకరించి అధికమంది తిలకించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
స్కూల్‌కు ఉచితంగా బస్‌లను ఏర్పాటు చేయాలని, ప్రణాళికాబద్ధంగా కార్యక్రాలు నిర్వహించాలన్నారు. జాతీయ పతాకాలను మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశా, ఆంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ పంపిణీ చేయాలన్నారు. జనగామ జిల్లాలోని 5 సినిమా థియేటర్లలో 27వేల మంది విద్యార్థులకు ఉచితంగా గాంధీ సినిమా చూపించాలని, అందరికీ రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. 10వ తేదీన విస్తృతంగా జిల్లా అధికారులు వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటాలన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా ముస్తాబు చేయాలన్నారు.
వజ్రోత్సవాల హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు 11న జిల్లా క్రీడల అధికారి ఆధ్వర్యంలో క్రీడాకారులతోపాటు యువత స్వచ్ఛంధంగా పాల్గొనేలా క్రీడా ఉత్సవాలు జరుపాలని, 12న సోదరభావాన్ని, జాతీయ సమైక్యతను చాటాలే ఎన్జీవోలు రాఖీ పండుగను ఘనంగా నిర్వహించాలని సూచించారు,. 13న ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగించేలా విద్యార్థులతో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్జీవోలు పాల్గొనాలని, 14న తెలంగాణ సాంస్కృతిక సారథులతో కార్యక్రమాలు, క్రాకర్స్‌తో ఫైర్ వేడుకలు, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న జిల్లాలోని అన్నిచోట్లా ఒకే సమయంలో జాతీయ గీతాలాపన కోసం ఏర్పాట్లు చేయాలన్నారు.
పోలీసుశాఖ జాతీయ గీతం ఆలపించే సమయంలో కొద్ది సమయం రోడ్లను బ్లాక్ చేయాలని సూచించారు. 17న విస్తృతంగా రక్తదాన శిబిరాలు, 18న గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిల్లో ప్రణాళికపరంగా క్రీడోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. 19న జిల్లాలోని అన్ని దవాఖానలు, వృద్ధాశ్రమాల్లో బ్రెడ్లు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేయాలని, 20న రంగోళి కార్యక్రమాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించాలని, 21న ముగింపు కార్యక్రమాలను ఘనంగా జరుపాలని సూచించారు.
అహింసతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీజీ మార్గం మనందరికీ ఆదర్శమని, ఇదే స్ఫూర్తితో భావి పౌరులు మెదలాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. గాంధీ చిత్ర ప్రదర్శన సమయంలో మంత్రిని చూసి పిల్లలు కేరింతలు కొట్టగా వారిని ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి సినిమా చూసి ఉత్సాహాన్ని నింపారు. గాంధీ చూపిన మార్గంలోనే సీఎం కేసీఆర్ గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్నారని పేర్కొన్నారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సమయంలో తాను మంత్రిగా ఉండడం గర్వకారణంగా భావిస్తున్నానని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాల్లో డీసీపీ సీతారాం, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, హమీద్, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, ఆర్డీవో మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.
భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పర్యటించారు. మొరిపిరాల గ్రామాలో గ్రామస్తులతో కలిసి వేడుకలను ప్రారంభించారు. ఇంటింటికీ తిరుగుతూ సర్పంచ్ అండ్రెడ్డి యాదమ్మతో కలిసి జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. తిరంగా శాంతియుత ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన నాయకుల జీవిత విశేషాలను యువత ప్రజలకు వివరించాలని కోరారు.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంబురాలు దేశంలో ఘనకీర్తిని సాధించేలా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం ఆర్అండ్ఆర్ కాలనీ, మైలారంలో పర్యటించి సర్పంచ్‌లు చెడుపాక కుమారస్వామి, లేతాకుల సుమతియాదవరెడ్డితో కలిసి జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, ఎంపీటీసీ అయిత రాంచందర్, అండ్రెడ్డి యాకూబ్‌రెడ్డి, పారుపల్లి సుధాకర్‌రెడ్డి, తాళ్లపల్లి సంతోష్‌గౌడ్, చేగూరి మల్లేశ్, నాగపురి అశోక్, తాళ్లపల్లి మల్లేశ్, నాగపురి సోమయ్య, రఘుపతి, పంచాయతీ కార్యదర్శులు వీరేందర్‌నాయక్, చిట్యాల సోమరాజు పాల్గొన్నారు.