హనుమకొండ, జూలై 31 : ఆటో కార్మికులను ఆదుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన త్రిచక్ర పొదుపు, పరపతి పరస్పర సహాయ సహకార సంఘం ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం ఆటో డ్రైవర్లు ఆటో అడ్డాలపై జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
కరోనా కష్టకాలంలో ఆటో డ్రైవర్ల బాధలను గుర్తించి సొసైటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సొసైటీలో ప్రతి సభ్యుడు నెలనెలా రూ.300 పొదుపు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు కోటి రూపాయలకు పైగా పొదుపు చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ ఫైనాన్స్‌ల వేధింపుల నుంచి ఆటో కార్మికులను రక్షించేందుకు సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆటో కార్మికులను ముందుకు తీసుకెళ్లేందుకు రూ.12 లక్షలు తన వేతనాన్ని అందించినట్లు వివరించారు.
సీఎం కేసీఆర్ చొరవతో ఆటో భవన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఆటో భవన్ నిర్మాణం పూర్తయితే వారి పిల్లలకు సిల్ డెవలప్మెంట్, ఉద్యోగాలు సమకూరుస్తాయని అన్నారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, కల్పలత సూపర్ బజార్ చైర్మన్ వర్దమాన్ జనార్దన్, డైరెక్టర్ ఏ జగన్మోహన్ రావు, డీటీసీ పురుషోత్తం, కార్మిక సంఘం నాయకుడు పుల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.