గిర్మాజీపేట, జూలై 31 : ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కాక మాధవరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ విభాగంలో 3,440 మంది, వొకేషనల్ విభాగంలో 442 మంది మొత్తం 3,842 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. వీరికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 2,054మంది, వొకేషనల్ విభాగంలో 252 మంది మొత్తం 2,306 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, వీరికి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంద న్నారు. జిల్లాలో మొత్తం 18 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
పరీక్షా కేంద్రాలను గుర్తించడం, విద్యార్థుల కేటాయింపుతో పాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులు, సిట్టింగ్ స్కాడ్స్ను నియమించామని పేర్కొన్నారు. సిబ్బందికి ఇప్పటికే పరీక్షల నిర్వహణపై అవగాహన కల్పించామని డీఐఈవో తెలిపారు.