పక్షులకు మనం ఏమాత్రం సహకరించకపోయినా మానవ మనుగడకు అవి ఎంతో తోడ్పడుతున్నాయి. వాటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు మనిషిని మంత్రముగ్ధులను చేస్తాయి. ఎన్నో రకాల పక్షులు ములుగు జిల్లాలో సుమారు 250 జాతుల దాకా ఉన్నాయి. వాటిలో సుమారు 60 జాతుల మనుగడ, ఆవాస కేంద్రాలు, జీవన విధానం, తదితర వివరాలను ‘నమస్తే తెలంగాణ’ సేకరించింది. ఆవరణ వ్యవస్థలో ఆవాసం ఉండే పక్షులు 5 నుంచి పదేళ్ల పాటు జీవిస్తాయి. ఇందులో మాంసాహార, శాఖహార పక్షులతో పాటు నిషాచర పక్షులు, నీటి పక్షులు ఉన్నాయి.
ములుగు, జూలై 30 (నమస్తే తెలంగాణ) అడవులు, నది, సముద్రం, చెరువులు, కుంటల్లో నిల్వ ఉండే నీటి ఆవరణల వద్ద రకరకాల పక్షులు ఉంటాయి. ఆవరణ వ్యవస్థల వద్ద ఉండే అనుకూల వాతావరణంలో జీవించే పక్షులు.. రైతులు పండించే పంటల సాగు విషయంలో ఎంతో మేలు చేస్తాయి. చీడపీడల నుంచి కాపాడేందుకు రసాయన ప్రక్రియను రైతులు చేస్తుండగా పంట పొలాల్లో పురుగులు, క్రిమికీటకాల అవశేషాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
దీంతో జీవవైవిధ్య, పర్యావరణ పరిరక్షణకు పక్షులే ఆధారంగా మారుతున్నాయి. ప్రజలు ఉపయోగించే రసాయనాలు, ఏర్పరిచే కాలుష్యం కారణంగా ఆవరణ వ్యవస్థలు దెబ్బతిని పక్షుల జాతుల సంఖ్య రానురానూ తగ్గిపోతోంది. ఉదాహరణకు గుడ్లగూబలు, చిలుకలు, వాటి ఆవాస ప్రాంతాలైన చెట్లతొర్రల్లో ఉంటాయి. ఈ తొర్రలు ఎక్కువగా ఎండిపోయిన చెట్లలోనే ఉంటాయి. కానీ ప్రతి చెట్టును నరకడం వల్ల కొన్ని జాతుల పక్షులకు ఆవాసాలు కరువయ్యాయి.
బీ ఈటర్స్ గాలిలో తిరిగే క్రిములను గుర్తించి పట్టుకొని తింటూ ఉంటాయి. ఇందులో మూడు రకాల బీ ఈటర్స్ ఉన్నాయి. వీటి తోకలు నీలి, ఆకుపచ్చ రంగులతో పాటు చిన్న తోకలు గల పక్షులను కలిగి ఉంటాయి. ఎంతో నైపుణ్యం ఉన్న ఈ పక్షి చిన్న తేనెటీగలను ఎక్కువగా తింటాయి గనుక వీటిని బీఈటర్స్ అంటారు.
గుడ్లగూబజాతికి చెందిన ఓల్స్(పెద్ద గుడ్లగూబలు), ఓలెట్స్(చిన్న గుడ్లగూబలు) ఆవరణ వ్యవస్థలో ఒక జాతి జంతువులు, పక్షుల సంఖ్యను నియంత్రించి అటవీ సంపదను కాపాడేందుకు ఉపయోగపడుతాయి. గ్రామాల్లో, పంట పొలాల వద్ద ఎలుకల సంఖ్యను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఈ గుడ్లగూబలు సరిసృపాలు(పాములు), ఎలుకలను ఆహారంగా చేసుకొని జీవ నియంత్రణ ద్వారా పంటలను రక్షిస్తాయి.
జిల్లాలోని అటవీ ప్రాంతంతో పాటు రామప్ప, లక్నవరం సరస్సులు, వివిధ గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటల్లోని ఆవాసాల్లో ఎక్కువగా కొంగలు ఉంటాయి. అలాగే నీటి కాకులు, గిజిగాడు, కంచరగాడిద పక్షులు, స్విప్ట్, స్వాలో, గుడ్లగూబలు, వడ్రంగి పిట్టలు, స్టిల్ట్ పక్షులు, వాటర్ బర్డ్స్ అయిన కింగ్ఫిషర్లు, జకాన నీటి పక్షులు, సాండ్గ్రౌస్ పక్షులు, కూడ్స్ నీటి పక్షులు, పైడ్ కుకూలు, నైట్జార్ పక్షులు, స్టార్క్స్, మునియస్ పక్షులు, ల్యాప్వింగ్ పక్షులు, చిన్న, మధ్య తరహా, పెద్ద కొంగలు, పచ్చపిట్టలు, గుడ్డికొంగలు, గువ్వలు, చుక్కల గువ్వలు, యూరోపియన్ గువ్వలు, బుల్బుల్ పిట్టలు, ముల్కానా పిట్టలు, వాటర్బర్డ్(గిజిగాడు), హెరాన్స్, స్నేక్బర్డ్స్, కూడ్స్ లాంటి పక్షులు ఆవాసాలను ఏర్పర్చుకొని జీవిస్తున్నాయి.
మగజాతి పక్షులు పసుపు రంగులో ఉంటూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ జాతికి చెందిన పక్షులు ఎన్నో రకాల చెట్లపై అత్యంత ప్రతిభావంతంగా గూళ్లు కడుతాయి. ఇవి ఎక్కువగా ఈత చెట్లు, తుమ్మ చెట్లు, నారేప చెట్లతో పాటు మరో 5 రకాల చెట్లకు గూళ్లు కడుతాయి. ఆడజాతి పక్షులకంటే మగ పక్షులు అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రత్యుత్పత్తి కాలంలో మగ పక్షులు రంగురంగుల్లో కనిపిస్తాయి. అదేవిధంగా ఇందు లో ఇంకో రకమైన కంచరగాడిద పక్షులు సైతం నల్లనివి, తెల్లనివి ఉంటాయి.
స్విప్ట్ స్వాలో జాతి పక్షులు ఎక్కువగా గాలిలోనే ఉంటాయి. గాలిలో సంచరించే కీటకాలను తేలికగా నోటితో గాలిలోనే పట్టుకొని వాటి ఆకలిని తీర్చుకుంటాయి. వీటిలో శాకాహారపక్షులు, మాంసాహార పక్షులు ఉంటాయి. ఇందులో భాగంగా గద్దలు వంటివి స్పెషల్గా మాంసాహారాన్నే తింటాయి. కైట్స్, ఈగల్స్, బుజాడ్స్, డేగలు, క్రెస్టల్స్, ఉల్చర్స్ ఎక్కువగా జంతువుల కళేబరాలను తింటాయి. వీటితో పాటు చిన్న పక్షులను వేటాడి తిని వాటి సంఖ్యను నియంత్రిస్తాయి.
తోక కిందిభాగం ఎరువు రంగులో ఉండి గుంపులు గుంపులుగా ఉండే ఈ పక్షులను బుల్ బుల్ పిట్టలని అంటారు. వీటి సంఖ్య అటవీ ప్రాంతంలో విస్తారంగా ఉంటుంది. ఈ జాతి పక్షి తోక కింది భాగాన్ని వెంట్ అని అంటారు. ఇది ఎరుపురంగులో ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది.
పక్షులు ఎక్కువగా నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. వాటిలో బ్లూ కింగ్ఫిషర్లు ప్రత్యేకతను సంతరించుకొని ఉంటాయి. అదేవిధంగా మెడ భాగంలో తెల్లగా ఉండే త్రొటెడ్ కింగ్ఫిషర్లు కూడా ఉంటాయి. నలుపు, తెలుపు ఎక్కువగా కలిసి ఉండే కింగ్ఫిషర్లను పైడ్ కింగ్ ఫిషర్లని అంటారు. ఇవి ఎక్కువగా నీరు నిలిచి ఉన్న చోట ఉన్నందున వీటిని నీటి పక్షులు అని కూడా అంటారు.
చిన్న, మధ్య తరహా, పెద్ద రకానికి చెందిన మూడు రకాల కొంగలు ఉంటాయి. ఇవి ఎక్కువగా పశువుల వెంట తిరుగుతాయి. పశువులు పొలానికి వెళ్తున్నప్పుడు గడ్డిలో ఉండే కీటకాలు పైకి లేచినప్పుడు ఈ కొంగలు పట్టుకొని తింటాయి. అందుకనే ఎక్కువగా ఈ కొంగలు పశువుల మంద వద్దనే బాగా కనిపిస్తాయి.
ముక్కు పొడవుగా ఉండి చెరువులు, కుంటల్లోని నత్తలను తింటూ ఉండే వాటిని స్టార్క్స్ అని అంటారు. నత్తలను ఎక్కువగా తినే ఈ పక్షులకు ఓ ప్రత్యేకత ఉంది. చెరువులు, కుంటల్లో కనిపించే నత్తలను తన ముక్కుతో పట్టి మింగే క్రమంలో ఈ పక్షుల ముక్కు మధ్య భాగంలో సందు ఏర్పడి ఉంది. ఆ ప్రాంతానికి నత్తను తీసుకున్న అనంతరం నత్త పొచ్చులు పగిలి కిందపడటంతో పాటు నత్తలోని లోపటి మొత్తటి భాగం దీని కడుపులోకి వెళ్తుంది.
ఈ జాతి పక్షుల్లో కుకు పక్షులతో పాటు పైడ్ కుకు పక్షులు కూడా ఉంటాయి. పైడ్ అంటే నలుపు, తెలుపుగా ఉండే వాటిని అంటారు. తలమీద చిన్న తోకలాగా కూడా ఉండే వాటిని క్రిస్టెడ్ పైడ్ కుకు అని అంటారు. గ్రామాల్లో ఇప్పటికీ ఈ పక్షులు కనిపించినా, కూత వినిపించినా వర్షాలు కురవడానికి సంకేతం అని నమ్ముతారు.
సాండ్బ్రౌస్ పక్షులకు పొట్టభాగంలో చెస్ట్ నట్ రంగులో ఉంటాయి. ఇవి ఎక్కువగా చెట్లు తక్కువగా ఉండి ఇసుక మేటలు వేసిన మైదాన ప్రాంతంలో ఉంటాయి. మరో రకమైన చెస్ట్నట్ బెల్లీడ్ అనే స్యాండ్బ్రౌజ్ పక్షులు రెక్కల భాగంలో కంచురంగులో మెరుస్తూ ఉంటాయి. వివిధ రంగులతో మెరిసినట్లు ఉండే మరో రకమైన ఈ జాతికి చెందిన పక్షిని పేయింటెడ్ స్యాండ్బ్రౌజ్ పక్షులని అంటారు.
ఈ జాతికి చెందిన పక్షులు నలుపు, తెలుపు, నశం రంగుల్లో ఉంటాయి. ముక్కు వద్ద మాంసం పెరిగినట్లు కూడా కనిపిస్తాయి. ల్యాప్వింగ్ పక్షులు ఎరుపు, పసుపు రంగుల్లో ఉంటాయి. వీటి రెక్కలు సైతం చాలా అందంగా ఉంటాయి. ఇవి నీటి ప్రాంతంలో దట్టమైన చెట్లపై కనిపిస్తాయి.
వడ్రంగి పిట్టలుగా పిలిచే ఈ పక్షులు రెండు రకాలు. బ్లాక్ షోల్డర్, ఉడ్పికర్ పక్షులు రెప్పభాగంలో నలుపు రంగులో ఉంటుంది. వెన్నుభాగంలో నిప్పు రంగులో ఉంటాయి. వీటిని ఫ్లేమ్ బ్యాక్డ్ ఉడ్పికర్స్ అని అంటారు. ఇవి ఎక్కువగా చెట్లను ఆవాసాలుగా ఏర్పర్చుకొని తొర్రల్లో జీవిస్తాయి.
నీటికాకుల జాతికి చెందిన ఈ పక్షిలో చిన్నవి, పెద్దవి ఉంటాయి. వీటిని ఎక్కువగా చేపలు పట్టే వారు పెంచుతారు. ఇతర ప్రాంతాల్లో చేపలు పట్టే క్రమంలో వీటిని వెంట తీసుకెళ్తారు. గొంతు భాగం వద్ద పక్షులు మింగకుండా చేపలు పట్టే వారు ఏర్పాటు చేసి నీటిలోకి వదులుతారు. నీటిలోకి వెళ్లిన ఈ పక్షులు చేపలను సులువుగా నోటితో పట్టుకుంటాయి.
నీటిని ఆవాసాలుగా చేసుకొని జీవించే పక్షుల్లో ఈ వాటర్ బర్డ్స్ ప్రధానమైనవి. ఇందులో బ్లాక్వింగ్డ్, స్టిల్ట్ పక్షులకు కాళ్లు పొడవుగా ఉంటాయి. ఇవి ఎక్కువగా గడ్డ ఉన్న ప్రాంతాల్లో ఆవాసాలు చేసుకుంటాయి. ఎందుకంటే వాటికి నడిచిపోయేటప్పుడు సులభంగా ఉండేందుకు ఎత్తైన ప్రాంతాల్లో జీవిస్తాయి.
గువ్వజాతికి చెందిన పక్షులు చాలా రకాలు. ఇందులో చుక్కల గువ్వ, యూరోపియన్ గువ్వ, లాఫింగ్ డవ్(గువ్వ) ఎక్కువగా కనిపిస్తాయి. శరీరమంతా ఎరువు రంగులో ఉండి మెడ భాగం నలుపు రంగులో ఉంటుంది. లాఫింగ్ గువ్వలు కూసినప్పు డు మనకు నవ్వినట్లు వినిపిస్తాయి. అందు కే వీటిని లాఫింగ్ డవ్స్ అని పిలుస్తారు.
మాల్కోహా పక్షులను సమరుకాకి అని పిలుస్తారు. ఇందులో సిర్కిర్ మాల్కోహా, గ్రే మాల్కోహా, గ్రీన్ బిల్ట్ మాల్కోహా పక్షులు ఎక్కువగా అటవీ ప్రాంతంలో కనిపిస్తాయి.
ప్రకృతిలో పక్షులకు, చెట్లకు విడదీయలేని బంధం ఉంటుంది. నాకు పక్షులు, చెట్లు అంటే అమితమైన ప్రేమ. నేను ఎక్కడ పనిచేసినా అడవులకు వెళ్లినప్పుడు నా సొంత కెమెరాను తీసుకెళ్తూ ఉంటా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడవులు అభివృద్ధి చెందడం వల్ల పక్షుల సందడి మొదలైంది. గతంలో ఆదిలాబాద్లో చేసినప్పుడు రాబందుల సంఖ్యను గుర్తించేందుకు కృషిచేశాను. ములుగు జిల్లాలోనూ అందమైన పక్షులు చాలా ఉన్నాయి. ఎఫ్ఆర్వోగా ఉన్న సమయంలో ఇలా చాలా పక్షుల ఫొటోలు తీశాను. ఇంకా గుర్తించాల్సినవి ఎన్నో ఉన్నాయి. కొత్తరకంతో పాటు అంతరించిపోయే దశకు వచ్చినవి కూడా కోకోల్లలు. అడవుల్లో ఉండే అన్ని జాతుల మొక్కలు, పక్షులపై ప్రత్యేకంగా పుస్తకం తయారుచేస్తున్నా. అడవులు, పక్షులకు హాని తలపెట్టకుండా ప్రకృతి ప్రేమికులుగా జీవించాలి.
– ఎం. రామ్మోహన్రావు, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్