వరంగల్,జూలై 26 : పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం కార్పొరేషన్లో అన్ని విభాగాల వింగ్ అధికారులతో పట్టణ ప్రగతి, నగరబాటలో గుర్తించిన సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర బాటలో గుర్తించి చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. పట్టణ ప్రగతిలో డివిజన్ వారీగా గుర్తించి వంగిన, తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలను తొలగించి వెంటనే కొత్త స్తంభాలను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య పనులు పటిష్టంగా నిర్వహించాలన్నారు. వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరో 36 హ్యాండ్ ఫాగింగ్ మిషన్లను వెంటనే కొనుగోలు చేయాలని ఆమె ఆదేశించారు. నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు.
తాగునీటి సరఫరాలో అంతరా యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనధికారిక లే అవుట్లపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లలో వేగం పెంచి నిర్ధేశిత లక్ష్యాన్ని సాధించాలన్నారు. వన్‌టైం స్కీంపై అవగాహన కల్పించాలన్నారు.
హరితహారం కార్యక్రమానికి మొక్కలు సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ సమావేశంలో బల్దియా కార్యదర్శి విజయలక్ష్మి, సీహెచ్‌వో శ్రీనివాస్ రావు, సీఎంహెచ్వో జ్ఞానేశ్వర్, ఎంహెచ్వో రాజేశ్, డిప్యూటీ కమిషనర్ జోనా, రవీందర్ రెడ్డి, అకౌంట్ అధికారి సునీత, హెచ్‌వో ప్రిసిల్లా, ఇన్చార్జి డీఎఫ్‌వో బషీర్, ఈఈలు లక్ష్మారెడ్డి, రాజయ్య, సాంబయ్య, భాస్కర్ పాల్గొన్నారు.