కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో తొర్రూరు సమీకృత బాలుర హాస్టల్ ఆకట్టుకుంటోంది. విద్యార్థులకు కావాల్సిన పూర్తి సౌకర్యాలతో 3వ తరగతి నుంచి డిగ్రీ విద్యను అభ్యసించే పేద బిడ్డలందరికీ ఆశ్రయం ఇస్తోంది. ప్రైవేట్ హాస్టళ్లను తలదన్నేలా తీర్చిదిద్దడంతో పాటు విజ్ఞానం పంచే డిజిటల్ లైబ్రరీ, ఆహ్లాదంగా హాస్టల్ ప్రాంగణం, గోడలపై స్ఫూర్తినిచ్చే నేతలు, దేశభక్తుల చిత్రాలు ఆకట్టుకుంటూ ఆలోచింపచేస్తున్నాయి. అలాగే సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించే కిచెన్ గార్డెన్ రాష్ట్రంలోనే అతిపెద్దది కావడం విశేషం. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ సమీకృత హాస్టల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
– తొర్రూరు, జూన్ 24
తొర్రూరులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీకృత బాలుర హాస్టల్ ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ విద్యార్థులకు సకల సౌకర్యాలతో ఆశ్రయాన్ని కల్పిస్తోంది. 3 నుంచి 10వ తరగతి వరకు 150 సీట్లు, ఇంటర్ నుంచిడిగ్రీ వరకు 150 సీట్లు ఉన్నాయి. పిల్లలకు విద్యాసంబంధిత వాతావరణం, పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ప్రత్యేక ట్యూటర్లతో బోధన, శారీరక దారుఢ్యానికి త్వరలోనే జిమ్ ఏర్పాటుకానున్నాయి. ఆరోగ్య భద్రత కోసం ప్రతి రోజు ఉదయం రాగి జావ, టిఫిన్, మధ్యాహ్నం పోస్ట్‌మెట్రిక్ విద్యార్థులకు భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రివేళ భోజనం, వారానికి మూడు కోడిగుడ్లు, మూడు అరటిపండ్లు, ప్రతి ఆదివారం చికెన్‌తో భోజనం ఇస్తున్నారు. వీటితో పాటు ఉచితంగా నాలుగు జతల యూనిఫాం, నోట్ పుస్తకాలు, చెప్పులు, షూ, కార్పెట్, బ్లాంకెట్, డబుల్‌కాట్ బెడ్, పరుపు అందజేస్తున్నారు. ప్రతి నెలా ప్రభుత్వం 7వ తరగతిలోపు విద్యార్థిపై రూ.950, 8 నుంచి 10వ తరగతి చదివే వారిపై రూ.1200, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులపై రూ.1500 చొప్పున వెచ్చిస్తున్నది. అన్ని కులాల విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం కల్పించారు.
హాస్టల్ ఆవరణ ఆకట్టుకునే రీతిలో ఉంది. గోడలపై క్రీడలు, విద్యా సంబంధ, స్ఫూర్తినిచ్చేలా వేసిన నేతల చిత్రాలు ఆలోచింపజేస్తున్నాయి. విశాలమైన డైనింగ్‌హాల్, కార్పొరేట్ లుక్‌తో డిజిటల్ లైబ్రరీ, గ్యాస్ పొయ్యిపై వంటలు, కూరగాయలు, పాలు వంటి పదార్థాల నిల్వ కోసం రిఫ్రిజిరేటర్, విద్యార్థులు సేద తీరేందుకు పరుపులతో కూడిన బెడ్స్ ఏర్పాటుచేశారు. దోమలు, కీటకా లతో ఇబ్బంది లేకుండా ప్రతి గదికి మెష్ డోర్స్ వేయించారు.
ఆ హాస్టల్లో ఏర్పాటుచేసిన కిచెన్ గార్డెన్లో ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నారు. దాదాపు ఇక్కడ కాసిన వాటినే నిత్యం వంటకు వినియోగిస్తున్నారు. హాస్టల్ ఆవరణలో వివిధ రకాల పండ్ల చెట్లను కూడా పెంచుతున్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఉన్న కిచెన్ గార్డెన్లలో రాష్ట్రంలోనే పెద్ద గార్డెన్‌గా ఇది గుర్తింపు పొందింది.
మా హాస్టల్లో ప్రీమెట్రిక్‌లో 30మంది, పోస్ట్మెట్రిక్లో 17మంది విద్యార్థులు ఉన్నారు. అడ్మిషన్ పొందాలనుకునే వారు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, బోనఫైడ్ సర్టిఫికెట్, ఏదైనా విద్యాసంస్థ నుంచి వస్తే టీసీ, నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకువచ్చి అడ్మిషన్ ఫారాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పిస్తూ హాస్టల్ నిర్వహణకు నిధులు వెచ్చిస్తోంది. సీట్ల భర్తీ కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. పరిసర మండలాలు, గ్రామాల్లో అడ్మిషన్ల కోసం తగిన ప్రచారం చేస్తున్నాం.
– జీకే శ్రీనివాస్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్