హనుమకొండ, జూన్ 21 : జయశంకర్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కులో మంగళవారం జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ జయశంకర్ జయంతి, వర్ధంతి నిర్వహించడం, సేవలను స్మరించుకోవడమే ఆయనకు ఘనమైన నివాళులన్నారు. రాష్ట్ర సాధనకు జయశంకర్ చేసిన కృషిని మంత్రి స్మరించుకున్నారు.
ఆయనతో తన కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ప్రొఫెసర్‌గా, తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు అని అని కొనియాడారు. 1952లో నాన్ ములీ ఉద్యమం, తర్వాత ఇడ్లీ, సాం బార్ గోబ్యాక్, 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి అని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థి దశలోనే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చిచారని గుర్తుచేశారు. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్ ఎదుట హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి అన్నారు.
అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించిన మహనీయుడని మంత్రి కొనియాడారు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి నిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ, రచనలు చేయడంతోపాటు ప్రత్యేక రాష్ట్ర వాదన, డిమాండ్ సాధనకు రాజకీయ ప్రక్రియ మార్గమని నిర్దేశించిన గొప్ప వ్యక్తి అన్నారు. ఇవన్నీ ఉద్యమకారులకు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఎర్రబెల్లి అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై జయశంకర్‌కు ఉన్న పరిజ్ఞానం ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చిందని తెలిపారు. ఆయన తన ఆస్తి, జీవితం తెలంగాణ కోసం అంకితం చేశారని చె ప్పారు.
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. తెలంగాణలోని ప్రతి పల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నదన్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద, విశ్వవిద్యాలయాల పరిశోధన సంస్థల సభలు, సమావేశాల్లో తెలంగాణ రణ నినాదాన్ని వినిపించిన పోరాట శీలి అన్నారు. తెలంగాణ ఉద్యమ స మయంలో సీఎం కేసీఆర్‌కు మార్గదర్శిగా తోడ్పాటు అందించి సిద్ధాంతకర్తగా చరిత్రలో నిలిచిపోయారని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ జయశంకర్ ఆశయా లు, ఆకాంక్షలను నెరవేరుస్తున్నారని వివరించారు.