డోర్నకల్, జూన్ 21 : వారంతా సమీప బంధువు లు.. పక్కపక్క ఇళ్లలో నివాసముంటున్న వారి కుటుంబాల్లో కరంటు కాటు తీవ్ర విషాదం నింపింది. ఇంటి పెద్ద దిక్కులను కోల్పోయి రోడ్డున పడ్డాయి. రాములోరి ఆలయానికి అనుసంధానంగా ఉన్న అభయాంజనేయస్వామి ఆలయంలోని మైక్ సెట్ వారి పాలిట మృత్యువైంది. దానిని సరిచేసేందుకు వెళ్లిన ముగ్గురు షార్ట్‌సర్క్యూట్‌తో స్పాట్లోనే మృతిచెంది కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది.
స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. అందనాలపాడు గ్రామంలోని రామాలయానికి అనుసంధానంగా ఉన్న శ్రీఅభయాంజనేయస్వామి దేవాలయంలో రెండు నెలలుగా మైక్‌సెట్ పనిచేయడం లేదు. దానిని సరిచేసేందుకు గ్రామానికి చెందిన దుంపల సుబ్బారావు(56), మిర్యాల మస్తాన్‌రావు(57), గొర్రెవెంకయ్య(53) వెళ్లారు. మైక్‌ను ఐరన్ పైపు చివరన కట్టి ఆలయం పక్కనే ఉన్న వేపచెట్టుపై కొమ్మకు అమర్చే క్రమంలో పక్కనే ఉన్న 11 కేవీ వైర్లు మైక్‌కు తగిలి షార్ట్‌సర్క్యూట్‌తో ముగ్గురూ కుప్పకూలిపోయారు. దుంపల సుబ్బారావుకు ఛాతీ భాగం పూర్తిగా కాలిపోగా, మస్తాన్‌రావు మోకాలికి, వెంకయ్యకు తొడపై కాలిన గాయాలయ్యాయి. గ్రామస్తులు కరంటు సరఫరా నిలిపివేసి చూసేసరికి ముగ్గురి మృతి చెంది ఉన్నారు.
సమీప బంధువులు ముగ్గురు ఒక్కసారిగా మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. వారిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతోపాటు తహసీల్దార్ వివేక్, ఎంపీడీవో అపర్ణ, సర్పంచ్ ఆంగోత్ మోహన్, ఎంపీటీసీ నీల, పలు పార్టీల నాయకులు తరలివచ్చారు. ఘటనా స్థలాన్ని సీఐ ఇస్లావత్ శ్రీనివాస్, ఎస్సై భద్రూనాయక్ పరిశీలించారు. కుటుం బ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మానుకోట ఏరి యా వైద్యశాలకు తరలించారు.
కాగా, సుబ్బా రావుకు భార్య ముగ్గురు కొడుకులు, కూతురు, మస్తాన్‌రావుకు భార్య ఇద్దరు కొడుకులు, వెంకయ్యకు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరంతా సన్నకారు రైతులు. ఈ ఘటనపై మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్ శశాంకతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా రు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలి పి, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వానకాలంలో విద్యుత్ సంబంధిత పనుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.