ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ కింద కోట్లాది నిధులిస్తూ కొత్తరూపు తీసుకొస్తోంది. గత నాలుగు విడుతల్లో చేపట్టిన కార్యక్రమాలతో ప్రతి ఊరికి అద్దంలా మెరిసే సీసీరోడ్లు, ఇరువైపులా తీరొక్క చెట్లు, ఆహ్లాదం పంచే పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామాలు ఇలా ఎన్నో సదుపాయాలు కల్పించింది. అయితే ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి, మంజూరైన నిధుల వివరాలతో పాటు అమలవుతున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల సమాచారం ప్రజలకు తెలిసేలా గ్రామ పంచాయతీ గోడలపై అలాగే గ్రామ ముఖ్య కూడళ్లలో ‘ప్రగతి’ నివేదికను బోర్డులపై ప్రదర్శిస్తోంది. పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇప్పటికే పలుచోట్ల ఏర్పాటుచేయగా మిగతా జీపీల్లో ప్రదర్శించేందుకు పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లుచేస్తున్నారు.
హనుమకొండ, జూన్ 13 : పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న కార్యక్రమాలకు స్వీకారం చుడుతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు, మంజూరైన నిధుల వివరాలు సేకరించి నివేదికలు రూపొందించి జీపీ గోడలపై రాయడంతో పాటు గ్రామ ముఖ్య కూడళ్లలో ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్ సర్క్యులర్ జారీ చేశారు.
ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, సౌకర్యాలు, మంజూరైన నిధులు, గతంలో ఏమేం ఉన్నాయి, ఇప్పుడు ఏం ఉన్నాయి అనే వివరాలు సేకరిస్తున్నారు. గ్రామ పంచాయతీల అధికారులు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా సమాచార బోర్డులను ఏర్పాటు చేశారు. మంజూరు చేసిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలను బోర్డులు, గోడలు, ఫ్లెక్సీలపై రాయించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో మార్పు వచ్చింది. గతంలో నిధుల కొరతతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక వసతులు కల్పించింది. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీకి నెలనెలా నిధులు మంజూరు చేస్తోంది. ఈ నిధులకు తోడు గ్రామ పంచాయతీకు వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తోడవడంతో పల్లెల్లో అభివృద్ధి పనులు జరుగతున్నాయి.
పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభించిన తర్వాత గ్రామాల్లో వచ్చిన మార్పులు, జరిగిన అభివృద్ధి పనులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2014 సెప్టెంబర్ నుంచి ప్రారంభించిన పల్లెప్రగతి ద్వారా ఇప్పటి వరకు ఆయా గ్రామాలకు విడుదలైన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులు, కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, రైతు వేదికలు, గ్రామ పంచాయతీ భవనాలు, వాటర్ ట్యాంకులు, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటా ఇచ్చిన నల్లా కనెక్షన్లు, విద్యుత్ స్తంభాల మార్చిడి, వీధి లైట్లు, మూడో లైన్ ఏర్పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను పంచాయతీ కార్యదర్శులు సేకరించారు. సేకరించిన ఈవివరాలను గ్రామ పంచాయతీల గోడలకు నల్ల రంగు వేసి తెలుపు రంగుతో రాయించడంతో పాటు గ్రామ ముఖ్య కూడళ్ల వద్ద ప్రజలకు కనిపించేలా ఫ్లెక్సీలపై రాయించి ఏర్పాటు చేశారు.
పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.128,70,75,363 నిధులు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 208 గ్రామ పంచాయతీలకు మంజూరు చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఆరు నెలల నుంచి గ్రామ పంచాతీయల ఖాతాల్లోకే నేరుగా నిధులను ప్రభుత్వం జమ చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతి నివేదికల బోర్డులు ఏర్పాటు చేశాం. పంచాయతీ కార్యాలయ గోడలతో పాటు గ్రామంలో ప్రజలకు కనిపించే విధంగా రెండు, మూడు చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆయా గ్రామాలకు మంజూరైన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలను బోర్డు, ఫ్లెక్సీలపై రాయిస్తున్నాం.
-వీ జగదీశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి