సుబేదారి, జూన్ 13 : ఇండ్ల తాళాలు పగులగొట్టి బంగారు, వెండి నగలు, మొబైల్ ఫోన్లను చోరీ చేస్తున్న ఓ యువకుడిని వరంగల్ సీసీఎస్, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిందితుడి అరెస్టు వివరాలను టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి డబ్బాల ప్రాంతానికి చెందిన బానోతు నవీన్ జల్సాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
హనుమకొండ పెద్దమ్మగడ్డ కన్నెమూల గణపతి కాలనీలో తాళం వేసిన ఇంట్లో 28 గ్రాముల బంగారు, 120 గ్రాముల వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్, బట్టలు చోరీ చేశాడు. మరో చోట మూడు మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పక్కా సమాచారంతో హనుమకొండ ట్రైలర్స్ స్ట్రీట్‌లో బంగారం షాపు వద్దకు నిందితుడు నవీన్‌తో పాటు మరో మైనర్ రాగా అరెస్టు చేశారు. వారి నుంచి 3 మొబైల్ ఫోన్లు, 28 గ్రాముల బంగారు, 120 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రతిభ చాటిన డీసీపీ అశోక్, టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్‌గైక్వాడ్, హనుమకొండ ఏసీసీ వీ కిరణ్‌కుమార్, సీఐ వేణుమాధవ్, సీసీఎస్ సీఐ రమేశ్, సిబ్బందిని సీపీ తరుణ్‌జోషి అభినందించారు.