పల్లెప్రగతితో పల్లెలు కళకళలాడుతున్నాయని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 11వ రోజు సోమవారం కమలాపూర్, ఉప్పల్, గుండేడు, మర్రిపల్లి, మర్రిపల్లిగూడెం, వంగపల్లి, శనిగరం, అంబాల, గూడూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.కోట్లాది రూపాయలు కేటాయిస్తోందని, సాగుకు 24 గంటల నాణ్యమైన కరంటు ఇస్తోందని చెప్పారు. కాళేశ్వరం నీళ్లతో కమలాపూర్ ప్రజల పాదాలు కడిగినట్లు చెప్పారు. గ్రామాల్లో ట్రాక్టర్ల ద్వారా తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డులను తరలిస్తున్నట్లు చెప్పారు. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
కమలాపూర్, జూన్ 13 : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతిలో భాగంగా 11వ రోజు సోమవారం మండలంలోని కమలాపూర్, ఉప్పల్, గుండేడు, మర్రిపల్లి, మర్రిపల్లిగూడెం, వంగపల్లి, శనిగరం, అంబాల, గూడూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. అలాగే, ఉప్పల్‌లో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి, వాలీబాల్ ఆడి స్థానిక యువకులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు కరంటు మోటర్లు పెట్టేందుకు రాత్రివేళ పొలాల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురై రైతులు చనిపోయేవారని గుర్తుచేశారు.
రాష్ట్ర ఏర్పాటుతో సాగుకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరంటు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు. కాళేశ్వరం నీళ్లతో కమలాపూర్ ప్రజల పాదాలు కడిగింది నిజమా? కాదా? గుర్తుచేసుకోవాలన్నారు. పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం కొననంటే రూ.4 కోట్లతో రైతులను ఆదుకునేందుకు కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడొద్దని రూ.5 లక్షల రైతుబీమా ఇస్తున్నట్లు చెప్పారు.
ఆసరా పింఛన్లు, గ్రామాల అభివృద్ధికి రూ.లక్ష నిధులు రావాలంటే నెలల తరబడి తిరిగేదన్నారు. కానీ, కేసీఆర్ కమలాపూర్ గ్రామానికే రూ.4,28,58, 180 ఇచ్చారని చెప్పారు. పల్లె ప్రగతిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్‌తో తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారని, పచ్చని చెట్లతో గ్రామాలు కళకళలాడుతున్నయని పేర్కొన్నారు. స్త్రీనిధి కింద కమలాపూర్‌కే రూ.4,51,71,880 కేసీఆర్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ది ఓట్ల ఆరాటమే తప్ప అభివృద్ధి కోసం కాదన్నారు. 8 ఏండ్లు మంత్రిగా ఉండి సొంత ఊరు కమలాపూర్‌లో మహిళా సంఘం భవనం కట్టించలేదన్నారు. ఆర్టీసీ బస్టాండ్, శ్మశానవాటికను కట్టించని దద్దమ్మ ఈటల రాజేందర్ అని మండిపడ్డారు. రూ.1.70 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మిస్తున్న ఘనత కేసీఆర్‌దే అన్నారు. కమలాపూర్ అభివృద్ధిపై ఈటల రాజేందర్‌కు ప్రేమ ఉంటే పల్లె ప్రగతికి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమమైన పల్లె ప్రగతికి హాజరై తన ఊరు అభివృద్ధి కావాలని అడగాల్సిన బాధ్యత ఆయనకు లేదా? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలో గెలిచి 8 నెలలు అయితాంది, ఏనాడైనా ఈటల రాజేందర్ తన స్వగ్రామం కమలాపూర్ అభివృద్ధి కోసం మాట్లాడిండా? అని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కోటి రూపాయల ఎమ్మెల్సీ నిధులతో శ్మశానవాటికను నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
కమలాపూర్‌లో కమ్యూనిటీ భవనాలు, శ్మశానవాటిక, మహిళా సంఘ భవనాలను నిర్మించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగనని చెప్పారు. మరో మూడు నెలల్లో 57ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. సొంత జాగలో ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల నిధులు ఇవ్వనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈవో సురభి వెంకటేశ్వర్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, డీపీవో జగదీశ్వర్, ఎంపీపీ రాణి, జడ్పీటీసీ కల్యాణి, సర్పంచ్‌లు కట్కూరి విజయ, ఎర్రబెల్లి దేవేందర్‌రావు, లక్ష్మణ్‌రావు, ఇనుగాల కిరణ్మ యి, చందుపట్ల రజిత, పోడేటి కమలమ్మ, పింగిళి రవళి, కుక్కల తిరుపతి, అంకతి సాంబయ్య, తహసీల్దార్ రాణి, ఎంపీడీవో రవి, ఎంపీటీసీలు, వార్డు స భ్యులు, నాయకులు, కార్యకర్తలు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.