నర్మెట, జూన్ 13: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. దీంతో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బీఎస్పీ, ఎమ్మార్పీఎస్‌కు చెందిన సుమారు 150 మంది కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్, సర్పంచ్ ఆమెడపు కమలాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందు చూపుతో రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యను పరిష్కరించారని వివరించారు. విద్య, వైద్యంపై ప్రత్యేక ప్రణాళికతో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని పేర్కొన్నారు. గ్రామాల్లోనూ యువజనుల కోసం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కేంద్ర మంత్రులు, అధికారులు ఎన్నోసార్లు ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారని ముత్తిరెడ్డి విమర్శించారు.
అంతకుముందు దళితబంధు పథకం ద్వారా నర్మెటకు చెందిన కొలిపాక యాదగిరికి రూ.10 లక్షలతో సెంట్రింగ్ మంజూరు కాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్, జడ్పీ కోఅప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, టీఆర్ఎస్ నర్మెట, తరిగొప్పుల మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కల్యాణం మురళి, మాజీ మండల అధ్యక్షుడు నీరేటి సుధాకర్, గ్రామ అధ్యక్షుడు నక్కల రవి, బెడుదం సుధాకర్, గోపగోని రవి, బుడ్డ భాస్కర్, కుంటి కమలాకర్, కొండ బాలయ్య, కొన్నె చంద్రయ్య, గొల్లపల్లి మురళి, ఇట్టబోయిన రమేశ్, టీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు గడపురం శశిరథ్, వెలంగిణి పాల్గొన్నారు.