తొర్రూరు మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి రూ.100కోట్ల నిధులతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించి, ఇప్పటికే రూ.50కోట్ల పనులను పూర్తి చేయగా, మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. సోమవారం తొర్రూరు మున్సిపాలిటీలో ‘పట్టణ ప్రగతి’లో మంత్రి పాల్గొని 9, 10 వార్డుల పరిధిలో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల ఆరోగ్య భద్రతకు అడుగులు వేస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. తొర్రూరు పట్టణాభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానని, హైదరాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ద్వారా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభానికి మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.1.25కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
తొర్రూరు, జూన్ 13: రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రజల ఆరోగ్య భద్రతకు కృషిచేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తొర్రూరు మున్సిపాలిటీ 9, 10 వార్డుల్లో సోమవారం 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నుంచి గరుగుబావి వరకు కోలాటాలు, డప్పుచప్పుళ్ల నడుమ మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. సభలో మహిళా సంఘాలకు రూ.కోటీ 25లక్షల బ్యాంక్ లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొర్రూరు మున్సిపాలిటీని అభివృద్ధికి దిక్సూచిగా మార్చబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.50కోట్ల పనులు పూర్తి చేయగా, మరికొన్ని పనులు ప్రారంభ దశలో ఉన్నాయని తెలిపారు. రూ.20కోట్లతో పట్టణంలో సెంట్రల్ లైటింగ్, మొక్కల పెంపకం, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, కొత్త రోడ్లు, మోడల్ ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, కోల్డ్ స్టోరేజ్, యతిరాజారావు పార్క్ అభివృద్ధి వంటి పనులు పూర్తి చేసినట్లు వివరించారు. మరో రూ.20కోట్లతో శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, సీసీ రోడ్లు, నగరంలో ప్రధాన రోడ్ల విస్తరణ, దుబ్బతండా, ఎస్సీ కాలనీలో శ్మశానవాటికలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. తొర్రూరు సమగ్ర అభివృద్ధికి హైదరాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ద్వారా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని, డిజిటల్ డోర్ నంబరింగ్ చేస్తున్నామని వెల్లడించారు.
అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, ఆర్డీవో రమేశ్, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుమర్తి శాంత, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ పొనుగోటి సోమేశ్వర్రావు, కమిషనర్ గుండె బాబు, తహసీల్దార్ రాఘవరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, స్థానిక కౌన్సిలర్లు చకిలేల అలివేణి నాగరాజు, దొంగరి రేవతి శంకర్, కర్నె నాగజ్యోతి నాగరాజు, సంగీతా రవి, యయున జంపా, సునీతా జైసింగ్, గజానంద్, శంకర్, మాధవి అనిల్, కో ఆప్షన్ సభ్యులు యాకాంత నర్సయ్య, జలీల్, శ్రీనివాస్, కవితా శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మిషన్ భగీరథ డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.